వాహన రుసుముల్లో అవకతవకలు, యాదాద్రి ఆలయ అధికారి సస్పెండ్ - యాదాద్రి ఆలయ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


Published : Nov 5, 2023, 7:14 PM IST
Yadadri Temple Record Assistant Suspend : యాదాద్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధికారుల చేతివాటం బట్టబయలైంది. దేవస్థానం కొండ కింద కెనరా బ్యాంక్ సిబ్బంది నిర్వహిస్తున్న వాహన శ్రేణి రుసుం కౌంటర్ నందు టికెట్ల అమ్మకాల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు దేవస్థాన అధికారులు ఇటీవల గుర్తించారు. ఈక్రమంలో రికార్డ్ అసిస్టెంట్ అధికారి సహా పలువురిపై ఆలయ ఈవో గీత సస్పెన్షన్ వేటు వేశారు.
కొండ కింద నుంచి కొండమీదకి వెళ్లే కార్లకు రూ.500 చొప్పున రసీదు ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ పనిచేస్తున్న దేవస్థాన సిబ్బంది మాత్రం టికెట్ ఇచ్చిన తర్వాత కొండమీదికి వెళ్లి.. కిందికి వచ్చే కార్ల దగ్గర తిరిగి టికెట్ కలెక్ట్ చేసుకుని రీసెల్ చేయడం జరిగింది. అది గమనించిన దేవస్థాన అధికారులు విచారణ చేయగా నిజమని తేలడంతో.. అక్కడ పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ వి.యాదగిరిని.. ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు కొందరు హోంగార్డ్లకు సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆలయ ఈవో గీత ఉత్తర్వులలో పేర్కొన్నారు.