100 పోటీల్లో ఓటమి ఎరుగని 'జల్లికట్టు' ఎద్దు మృతి.. ఘనంగా అంత్యక్రియలు - జల్లికట్టు పోటీలు అప్డేట్లు
🎬 Watch Now: Feature Video
తమిళనాడులో జల్లికట్టు పోటీలకు ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది. బసవన్నలు రంకలేస్తూ ఉంటే.. ఆటగాళ్లు వాటిని నిలువరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో ఎద్దులు కూడా వారికి చిక్కకుండా విజయం సాధిస్తుంటాయి. అలా వందకు పైగా జల్లికట్టు పోటీల్లో విజేతగా నిలిచిన ఓ ఎద్దు.. అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆ ఎద్దును పెంచుకుంటున్న గ్రామస్థులు.. ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని కవరయపట్టి గ్రామస్థులు.. ఓ ఎద్దును మంతై ముత్యాలమ్మన్ ఆలయంలో పెంచుతున్నారు. చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడ జల్లికట్టు పోటీలు జరిగినా.. ఈ ఎద్దుదే విజయం! అలా వందకుపైగా జల్లికట్టు పోటీల్లో విజయం సాధించింది. ఎన్నో పతకాలు, బహుమతులు కూడా గెలుచుకుంది. అయితే ఈ ఎద్దును గ్రామస్థులు ఎప్పుడూ కట్టివేయరు. ఇంటింటికీ వెళ్లి గ్రామస్థుల ఇచ్చే పండ్లు, గడ్డిని ఈ ఎద్దు ఆరగిస్తుంటుంది. తమ పొలాల్లోకి వచ్చి పంటను తినేసినా గ్రామస్థులు ఏమీ అనరు. ఈ ఎద్దు సైతం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా.. గ్రామస్థులతో ఎంతో అప్యాయంగా ఉంటుంది. అయితే ఆరోగ్యం బాగోలేక ఈ ఎద్దు.. సోమవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇన్నాళ్లూ తమతో కలివిడిగా ఉన్న ఎద్దుకు.. ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని గ్రామస్థులంతా నిర్ణయించారు. అందుకు సంబంధించి అన్ని రకాల వస్తువులను సమకూర్చారు. ఎద్దు మృతదేహానికి గంధం, పసుపు రాసి బొట్టుపెట్టి అలకరించారు. కొత్త వస్త్రాలు కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎద్దు మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి.. ఆలయ సమీపంలోనే ఖననం చేశారు. అంత్యక్రియలకు చుట్టు పక్క గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు.