VC on TU Controversy : 'రిజిస్ట్రార్ కుర్చీ కొట్లాట'పై వీసీ స్పందన ఇదే
🎬 Watch Now: Feature Video
VC on TU Controversy : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం కొనసాగుతోంది. రిజిస్ట్రార్ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో వర్సిటీ పరువు బజారున పడుతోంది. తాజాగా విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్లో పీడీఎస్‌యూ, బీవీఎమ్, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాల నాయకులు నిరసనకు దిగారు. వీసీ వెంటనే రాజీనామా చేసే వరకు కదిలేది లేదని భీష్మించారు. వీసీ టేబుల్ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. నెలల తరబడి ఎడతెగని వివాదాల కారణంగా అకడమిక్, నాన్ అకడమిక్ సిబ్బంది సైతం తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.
వీసీ పదవిని అడ్డం పెట్టుకుని రవీందర్ గుప్తా అధికార దుర్వినియోగానికి పాల్పడటం, నిధులను నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించడం వంటి ఆరోపణలపై ఈసీ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. విచారణకు ఏసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ)కు సైతం లేఖలు రాసింది. మరోవైపు వీసీ అధికారాలను కత్తిరించింది. క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. తర్వాత కలిసి పని చేస్తామని ఈసీ సభ్యులకు వీసీ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగినట్లే అనిపించింది. కానీ వీసీ రవీందర్ గుప్తా మళ్లీ రిజిస్ట్రార్‌ను మార్చడంతో వివాదం మొదటికి వచ్చింది. ఈ మొత్తం గందరగోళానికి సంబంధించిన అంశాలపై వీసీ రవీందర్ గుప్తాతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..