తప్పిన భారీ ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు.. చివరకు.. - Lohit Express divided into two parts in Katihar
🎬 Watch Now: Feature Video

బిహార్‌లోని కతిహార్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాల మీద నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బంగాల్లోని నార్త్ దినాజ్‌పుర్ జిల్లాలోని ఉన్న దల్ఖోలా స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగింది?
మంగళవారం లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. గువాహటి నుంచి జమ్ము తపాయికి బయలుదేరింది. దల్ఖోలా స్టేషన్ సమయంలో రైలు.. ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఇంజిన్ నుంచి సుమారు పది బోగీలు విడిపోయాయి. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కోచ్ నుంచి బోగీలు విడిపోయాక.. అనేక మంది ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, దల్ఖోలా స్టేషన్ మాస్టర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్‌కు జతచేసి.. రైలు ప్రారంభించారు అధికారులు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత కూడా రైల్వే అధికారుల్లో చిత్తశుద్ధి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతను అధికారులు పట్టించుకోవట్లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బాలేశ్వర్‌లో మూడు రైళ్ల ఘోర ప్రమాదంలో 291 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు.