టెన్షన్.. టెన్షన్.. వీధుల్లో ఎలుగుబంట్లు హల్చల్.. ప్రజలు హడల్!
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని అటవీ సరిహద్దు ప్రాంతాల్లో కృూర మృగాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. వాటిని నిలువరించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటకీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. అటవీ జంతువులు జనావాస ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మూడు ఎలుగుబంట్లు ఉధమ్ సింగ్ నగర్ జిల్లా.. సితార్గంజ్లోని సిడ్‌కల్ ప్రాంతంలో ఇళ్ల మధ్య సంచరిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి ఎలుగుబంటితో పాటు దాని రెండు పిల్లలు.. జనావాసాల్లో తిరుగుతుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా ఓ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎస్డీఓ సంతోష్ పంత్ స్పందించారు. అటవీ జంతువులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. అందుకు కారణాలను కనిపెట్టేందుకు ఓ జీవశాస్త్రవేత్తను నియమించామని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాల వైపు వెళ్లొద్దని.. సంతోష్ పంత్ విజ్ఞప్తి చేశారు.