TDP MP Rammohan Complaint on AP CID Chief : 'సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు..' కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు - ఎంపీ రామ్మోహన్ నాయుడు
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2023, 3:30 PM IST
TDP MP Rammohan Complaint on AP CID Chief సీఐడీ చీఫ్ సంజయ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ వైసీపీ తొత్తుగా పనిచేస్తున్న ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ (AP CID Chief Sanjay) పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ మేరకు రాజకీయ పక్షపాతాలు లేకుండా పనిచేయాల్సిన సీఐడీ చీఫ్... అన్నింటినీ ఉల్లంఘించారని హోం మంత్రికి ఆధారాలు అందచేశారు. వైసీపీ కార్యకర్త మాదిరిగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజయ్... సీఎం వైఎస్ జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని కేంద్ర హోంశాఖ దృష్టికి రామ్మోహన్‌నాయుడు తీసుకెళ్లారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో ప్రతిపక్షనేత చంద్రబాబుని అరెస్టు చేసి విచారణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచారణ జరపకుండానే, సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు పెడుతూ ఆరోపణలు చేయడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. దర్యాప్తు అంశాలు రూపొందించి కోర్టులకి నివేదించాల్సిన బాధ్యత గలిగిన ఐపీఎస్ అధికారి ఫక్తు వైసీపీ నేతలాగా దిల్లీ, హైదరాబాద్, అమరావతిలో మీడియా సమావేశాలు పెడుతూ ప్రతిపక్ష నేతపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, దర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలు మీడియాకి విడుదల చేస్తున్నారంటూ ఆరోపించారు. సీఐడీ చీఫ్ సంజయ్ ఉల్లంఘించిన సర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధనలు, అడ్డగోలు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధారాలను హోంశాఖకు అందజేశారు.