JC Prabhakar: జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మున్సిపల్ ఆఫీసులో స్నానం.! - JC Prabhakar
🎬 Watch Now: Feature Video
JC Prabhakar Reddy Protest: అనంతపురం జిల్లాలో వాతావరణం వేడెక్కుతోంది. తాడిపత్రిలో నిన్న ఉదయం నుంచి హైటెన్షన్ కొనసాగుతోంది. పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణాతో పాటు, తాడిపత్రిలో మున్సిపల్ కమిషనర్ విధుల నిర్లక్ష్యంపై మున్సిపల్ ఆఫీస్ ఎదుట వంటావార్పునకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో జేసీ ఇంటి దగ్గరకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదన్న పోలీసులు.. ముందస్తు చర్యల్లో భాగంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. 100 మంది టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల చర్యలను ఖండిస్తూ తన ఇంటి ముందే కుర్చీలో కూర్చొని జేసీ నిరసన తెలిపారు. కుర్చీతో సహా జేసీని బలవంతంగా తిరిగి లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించారు.
అయితే మున్సిపల్ కమిషనర్ తీరును ఖండిస్తూ నిన్న రాత్రి మున్సిపల్ కార్యాలయం ఎదుటే జేసీ ప్రభాకర్ రెడ్డి బస చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి కొనసాగింపుగా ఉదయాన్నే అక్కడే స్నానం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం ముందు టెంట్ వేసి మహిళా కౌన్సిలర్లతో కలిసి నిరసన కొనసాగిస్తున్నారు. పురపాలికలో అక్రమాలు జరుగుతున్నా.. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి అభివృద్ధిని కమిషనర్ భ్రష్టు పట్టిస్తున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం కౌన్సిలర్లకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.