Margadarsi: "మార్గదర్శి కేసులో పిటిషన్లన్నీ ఈ ధర్మాసనం ముందుకే" - మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ
🎬 Watch Now: Feature Video
Margadsari Case Updates: మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై ఏపీ సీఐడీ పోలీసులు పెట్టిన కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ తాము దాఖలుచేసిన కేసుతోపాటు, అక్కడ విచారణలో ఉన్న కేసులన్నింటినీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్ పిటిషన్లను జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ముందుకు పంపాలన్న ఏపీ ప్రభుత్వ వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. అన్ని కేసులనూ వచ్చే నెల 4న ఈ బెంచ్ ఎదుటే లిస్ట్ చేయాలని పేర్కొంటూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్ పిటిషన్ బుధవారం ఈ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది మెహఫూజ్ నజ్కీ వాదనలు వినిపిస్తూ ఈ కేసులన్నింటినీ కలిపి విచారించాలంటూ ఈ నెల 24న జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసినందున అన్ని కేసులనూ అక్కడికి బదిలీ చేయాలని కోరారు. మార్గదర్శి తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ జోక్యం చేసుకొని వాదనలు వినిపించబోగా న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఈ కేసును వచ్చే వారం వింటామని పేర్కొన్నారు. అలాగైతే తమకు అభ్యంతరం లేదని సింఘ్వీ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ నాలుగు కేసులను ట్యాగ్ చేయాలని ఈ నెల 24న ధర్మాసనం ఆదేశించిందని చెప్పారు. ఈ ట్రాన్స్‌ఫర్ పిటిషన్ కేసు ఇదివరకే ఈ ధర్మాసనం ముందు లిస్ట్ అయిందని మార్గదర్శి న్యాయవాది సింఘ్వీ గుర్తుచేశారు. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ పిటిషన్లు ఇదివరకే పెండింగ్‌లో ఉన్నందున అన్నీ ఇక్కడే విచారించాలని పేర్కొన్నారు. దాంతో జస్టిస్ జేకే మహేశ్వరి అన్ని కేసులనూ వచ్చే నెల 4న ఈ బెంచ్ ఎదుట లిస్ట్ చేయాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేశారు.