డోర్ దగ్గరే పాము.. ఏటీఎం లోపల మహిళ.. టెన్షన్ టెన్షన్.. చివరకు..
🎬 Watch Now: Feature Video
కేరళ ఇడుక్కి జిల్లా కూత్తర్ పట్టణంలోని ఓ ఏటీఎంలో పాము కలకలం సృష్టించింది. నాగుపామును గమనించని ఓ మహిళ డబ్బు విత్‌డ్రా కోసం ఏటీఎం లోపలకు ప్రవేశించింది. డ్రా చేసుకుని తిరిగి వెళుతుండగా డోర్ దగ్గర బుసలు కొడుతున్న పామును చూసి ఒక్కసారిగా వణికిపోయింది. భయంతో డోర్ వెనక్కు వెళ్లి దాక్కుంది. కొన్ని నిమిషాలు గడిచాక అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఏటీఎంలోని మహిళను గమనించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. అదృష్టవశాత్తు ఆ మహిళను పాము కాటువేయకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో ఆ పాము భయంతో ఏటీఎం లోపలకు చొరబడింది. టెక్నికల్ సిబ్బంది సహాయంతో ఏటీఎంలోని భాగాలను విడదీశారు. అయినా పాము కనిపించకపోవడం వల్ల స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఎంతో శ్రమించిన అటవీ శాఖ సిబ్బంది ఎట్టకేలకు పామును పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా పెరియార్ టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు.
కొన్ని నెలల క్రితం.. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ బ్యాంకు ఏటీఎంలో వెలుగుచూసింది. అందరూ చూస్తుండగానే ఓ భారీ నాగుపాము ఏటీఎంలోకి ప్రవేశించింది. దీనిని గమనించిన సెక్యూరిటీ గార్డ్ ఏటీఎం తలుపు మూసివేయటం వల్ల అది భయంతో మెషీన్‌లోని ఓ రంధ్రం గుండా లోపలికి ప్రవేశించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది సర్పాన్ని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు.