Puneeth Raj Kumar Portrait In The Field : పునీత్ రాజ్‌కుమార్ అభిమాని చేసిన పనికి అందరూ ఫిదా.. రైతును అభినందించిన పవర్‌స్టార్ భార్య! - పొలంలో కన్నడ పవర్ స్టార్ రాజ్‌కుమార్ ఆకృతి
🎬 Watch Now: Feature Video
Published : Oct 14, 2023, 2:25 PM IST
|Updated : Oct 14, 2023, 2:53 PM IST
Puneeth Raj Kumar Portrait In The Field : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌పై ఓ రైతు వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. వరిపంటలోనే తన అభిమాన నటుడి చిత్రాన్ని తీర్చిదిద్ది అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయనే కర్ణాటకలోని రాయచూరుకు చెందిన సత్యనారాయణ.
వృత్తిరీత్యా రైతు అయిన సత్యనారాయణ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని. తన అభిమాన హీరో రెండో వర్ధంతి సందర్భంగా అందరికంటే భిన్నంగా నివాళులర్పించాలని అనుకున్నారు. తన పొలంలో పండించే వరిలో పునీత్ రాజ్‌కుమార్ భారీ చిత్రాన్ని ఏర్పాటు చేయాలని సత్యనారాయణ భావించారు. రెండు ఎకరాల భూ విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయాలని తలచారు. తెలంగాణ, గుజరాత్‌లకు చెందిన కావేరి, గోల్డెన్ రోజ్, కాలాబట్టి అనే 100 కిలోల వరి విత్తనాలను నాటారు. వీటిని పునిత్ చిత్రం వచ్చే విధంగా పొలంలో నాట్లు వేశారు.
అయితే, అతడి ప్రయత్నానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షాలు లేకపోవడంతో నీటి కొరత వల్ల పంటలు ఎండిపోయే స్థితికి వచ్చాయి. అయితే సత్యనారాయణ మాత్రం నిరాశ పడలేదు. ట్యాంకర్లు, బోర్వెల్ల ద్వారా పంటకు నీటిని అందించారు. దీనికి ఆయనకు రూ.3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 90 రోజుల్లో పండే వరిలో 'అప్పూ' చిత్రం అందంగా రూపుదిద్దుకుంది. పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటం కింద 'కర్ణాటక రత్న' అనే పేరు వచ్చేలా నాట్లు వేశారు సత్యనారాయణ. ప్రతి అక్షరం పొడవు, వెడల్పులు 40 అడుగులు ఉండేవిధంగా ఏర్పాటు చేశారు.
తాను చిన్నప్పటినుంచి పునీత్‌రాజ్ కుమార్‌కు పెద్ద అభిమానిని అని, ఆయనకు వినూత్నంగా నివాళులు అర్పించాలని ఈ విధంగా చేశానని సత్యనారాయణ అంటున్నారు. ప్రస్తుతం పునీత్ చిత్తరువు చూపరుల మనసు దోచుకుంటోంది. తన భర్త చిత్రపటాన్ని పొలంలో అందంగా ఏర్పాటు చేసిన రైతు సత్యనారాయణను పునీత్ భార్య అభినందించారు.