Odela Mallanna Brahmotsavam : ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాల్లో ఘనంగా.. 'అగ్నిగుండ కార్యక్రమం' - peddapalli latest news
🎬 Watch Now: Feature Video
Odela Mallanna Brahmotsavam 2023 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి స్వామివారికి వేద పండితులు కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా జనసందోహంతో సందడిగా మారింది. ఒగ్గుడోలు పూజారులు ఆలయ ఆవరణలో పెద్దపట్నం వేసి స్వామివారిని కొలువుదీర్చారు.
ఈరోజు తెల్లవారుజామున ఆలయంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్ని గుండ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో తెలంగాణతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా అగ్నిగుండం దాటే క్రమంలో మంథనికి చెందిన ఓ భక్తుడు జారి గుండంలో పడగా స్వల్ప గాయాలయ్యాయి.