moosi flood: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ.. నిలిచిన వాహన రాకపోకలు - telangana latest news
🎬 Watch Now: Feature Video
moosi floods in yadadri bhuvanagiri: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మూసీనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం కత్వ వద్ద లో లెవల్ బ్రిడ్జి మీదుగా మూసీనది ప్రవహిస్తుడటంతో భువనగిరి మండలం బొల్లేపల్లి - చౌటుప్పల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బీబీ నగర్ మండలం రుద్రవెళ్లి వద్ద లో లెవల్ బ్రిడ్జి మీద మూసీ పరవళ్లు తొక్కుతోంది. దీంతో బీబీ నగర్ - పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇతర మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మరోవైపు మూసీ నదిలో గుర్రపు డెక్క పేరుకు పోయి భీమలింగం బ్రిడ్జిపై నిలిచింది. లో లెవల్ వంతెనలను ప్రయాణీకులు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అలాగే భువనగిరి నియోజకవర్గ పరిధిలో భువనగిరి, బీబీ నగర్, పోచంపల్లి మండలాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షాలకు నియోజకవర్గ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంత మేర తడిసింది. భువనగిరి మార్కెట్ యార్డులో ధాన్యం రాశులు తడిసి మొలకలు వచ్చాయని రైతులు వాపోతున్నారు. ధాన్యం రాశులను కాపాడుకోవటానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, గత మూడు నాలుగు రోజులుగా జిల్లాలో అకాల వర్షాలు కురుస్తుండటంతో రోజు మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే గడపాల్సి వస్తుందని, రోజు వర్షానికి ధాన్యం తడుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టడానికి కూలీ ఖర్చులు భరించలేకుండా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.