Sarpanch Navya Controversy : 'ఆధారాలున్నా చర్యలు తీసుకోరేం'.. పోలీసులపై సర్పంచ్ నవ్య ఫైర్
🎬 Watch Now: Feature Video
MLA Rajaiah Sarpanch Navya Controversy : రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య వివాదంలో కొత్త మలుపు వెలుగుచూసింది. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ సర్పంచ్ నవ్య గతంలో ఆరోపణలు చేసిన విషయం విధితమే. అయితే గతంలో ఈ వివాదాన్ని రాజయ్య, నవ్య సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఒప్పందంలో భాగంగా జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం తన నిధుల నుంచి రూ.25 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే.. నవ్యకు హామీ ఇవ్వడంతో ఆ సమస్యకు అక్కడితో సద్దుమణిగింది.
తాజాగా ఈ నెల 20న జానకీపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య.. సర్పంచ్ నవ్యపై తీవ్ర ఆరోపణలు చేయడంతో సద్దుమణిగిన వివాదం కాస్తా.. మళ్లీ రాజుకుంది. అయితే ఆ మరునాడే ఒప్పందం పేరిట రాజయ్య తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నవ్య.. ధర్మసాగర్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సహా ఆయన అనుచరుడు శ్రీనివాస్, తన భర్త ప్రవీణ్, ఎంపీపీ కవితపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో ముగిసిపోయిందనుకున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
ఎమ్మెల్యే రాజయ్య తనను వేధిస్తున్నారని.. జానకీపురం సర్పంచ్ నవ్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈనెల21న నలుగురి పై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఏందుకు నమోదు చేయలేదని సీఐ రమేశ్‌ను ప్రశ్నించారు. తాము న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఈ విషయంపై సీఐ రమేశ్ మరో రకంగా మాట్లాడుతున్నారు. సర్పంచ్ నవ్య మూడు రోజుల క్రితం తమ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారని.. దీనిపైన తగిన ఆధారాలు ఇవ్వక పోవడంతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సీఐ రమేశ్ వెల్లడించారు.