Etela Rajender: 'దళితబంధులో అవినీతి జరుగుతుందని కేసీఆర్ స్వయంగా చెప్పారు' - దళిత బంధు పథకానికి అర్హతలు
🎬 Watch Now: Feature Video

Etela Rajender comments on Dalit Bandhu: దళిద బంధు పథకంలో కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను వెంటనే ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో డ్రైవర్ల బీమా పంపిణీ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. అవినీతికి పాల్పడిన డబ్బులను వెంటనే వాపసు చేసుకోవాలని సూచించారు. ఈ ఆరోపణలు ప్రతిపక్షాలు కానీ.. ఇతరులు కానీ చేయలేదని.. స్వయంగా ముఖ్యమంత్రే చేశారని గుర్తు చేశారు. దళిత బంధును గొప్పగా అమలు చేస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పినా.. ఎన్నో కొర్రీలు పెట్టి అర్హులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి రూ.2 వేల కోట్లను కేటాయించినట్లు చెబుతున్న సీఎం.. వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు. చాలా మంది ప్రజాప్రతినిధులు అవినీతిలో మునిగిపోయారని విమర్శించారు. వెంటనే దళిత బంధు అందరికీ ఇవ్వడమే కాకుండా లంచంగా తీసుకున్న డబ్బు తిరిగి తీసుకొని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల కోరారు.