నాలుగు రోజులుగా వైఎస్సార్ జిల్లాలో ఐటీ సోదాలు - సీఎం జగన్ సన్నిహితుడు, కేసీ పుల్లయ్య ఆర్థిక లావాదేవీల తనిఖీ
🎬 Watch Now: Feature Video
Published : Dec 21, 2023, 1:22 PM IST
|Updated : Dec 21, 2023, 5:22 PM IST
IT Raids in YSR District Proddutur: వైఎస్సార్ జిల్లాలో గత నాలుగు రోజులుగా ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. వైఎంఆర్ కాలనీలో నివాసం ఉంటున్న కేసీ పుల్లయ్య ఇల్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఆరుగురు ఐటీ అధికారుల బృందం ప్రొద్దుటూరులోనే కేసీ పుల్లయ్య నివాసంలో ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ పనులు చేస్తున్న కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ ఆర్థిక లావాదేవీలపై ఐటి అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల రూపాయల నిర్మాణ పనులు చేస్తున్న అనిల్ ప్రొద్దుటూరులోని కూరగాయల మార్కెట్ కాంట్రాక్ట్ పనులు పనులు కూడా చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్యాంకు లావాదేవీలు, ఆదాయ పన్నుశాఖకు చెల్లిస్తున్న పన్నులు వివరాలన్నింటినీ ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని కేసీ పుల్లయ్య సంస్థల్లోనూ ఐటి సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.
సీఎం సన్నిహితుడి ఇంట్లో ఐటీ సోదాలు : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడైన విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన కడప షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌లో నాల్గో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వరసగా నాలుగు రోజుల పాటు తెలంగాణ నుంచి వచ్చిన ఐటీ అధికారులు కంపెనీ కార్యాలయాలు, ఇళ్లు, కర్మాగారాల్లో సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా కడప శివారులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు కర్మాగారంలో సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల బందోబస్తు మధ్య ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే కాకుండా కడప ద్వారకానగర్‌లో విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడైన చిన్నపిల్లల వైద్యుడు కరుణాకర్ రెడ్డి ఇంట్లో కూడా నాలుగు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేస్తున్నారు. కంపెనీ విద్యుత్ స్మార్టు మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్ల విడి భాగాలు కొనుగోలు చేసే సమయంలో, తర్వాత అమ్మకాలు చేసిన సమయంలో ఆదాయపన్నుశాఖకు చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా చెల్లించలేదనే ఆరోపణలతో ఐటీ శాఖ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు జరిగిన తనిఖీల్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐటీ అధికారుల సోదాలు సందర్భంగా కార్యాలయం పరిసర ప్రాంతాలకు మీడియాను అనుమతించకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు.