తుపాకీ కాల్పులతో హోలీ వేడుక.. దీపావళి పండుగను తలపించేలా..
🎬 Watch Now: Feature Video
మనదేశంలో వింతలు విడ్డూరాలకు కొదవలేదు. ఏ మూలకు వెళ్లినా ఓ వింత ఆచారం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతంది. అయితే రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో కూడా ఎవరూ జరుపుకోని విధంగా హోలీ పండుగను చేసుకుంటుంటారు ప్రజలు. అందరిలాగా రంగులతో కాకుండా గన్‌పౌడర్‌తో హోలీ పండుగను నిర్వహించుకుంటారు. జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెనార్ గ్రామస్థులు ఈ వేడుకను చేస్తారు. దీనిని ప్రతి సంవత్సరం హోలీ తర్వాతి రోజున నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా తుపాకుల్లో గన్‌పౌడర్‌ను నింపి గాల్లోకి కాల్పులు జరుపుతారు. అంతేగాక, పెద్ద ఎత్తున బాణాసంచాను కూడా కాలుస్తారు. ఈ కార్యక్రమంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ పాల్గొంటారు. ఈ సంబరాలను చూస్తుంటే ఇది హోలీ పండగా లేదా దీపావళా అని అనిపిస్తుంది. అయితే ఈ విధంగా హోలీని జరుపుకోవడం వెనుక ఓ చారిత్రక కారణం ఉందని చెబుతున్నారు స్థానికులు. ఈ గ్రామ ప్రజల పూర్వీకులు అప్పట్లో మొఘల్ చక్రవర్తులతో పోరాడి గెలిచేందుకు చేసిన ప్రయత్నాలకు గుర్తుగా దీనిని నిర్వహిస్తామని అంటున్నారు. సుమారు 500 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని వారి వారసులు చెబుతున్నారు. ఈ వేడుకల సమయంలో గ్రామస్థులు తమ పూర్వీకుల బలిదానాలు, త్యాగాలతో పాటు వారి వీరోచిత పోరాటాలను గుర్తు చేసుకుంటారు.