150 అడుగుల లోయలో పడ్డ గోధుమల లోడ్ వెహికల్.. ఐదుగురు మృతి - హిమాచల్ ప్రదేశ్ధర్మశాలలో ఘోర రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
150 అడుగుల లోయలో గోధుమల లోడ్ వాహనం పడ్డ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
ఒకే కుటుంబంలోని ముగ్గురు..
గోధుమల సంచులతో భారీ లోడ్ వేసుకుని వెళ్తున్న ఓ వాహనం.. ధర్మశాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉతాదగ్రన్ వద్ద 150 అడుగుల ఓ లోయలో అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న పదిమందిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని ఆస్పత్రికి తరలించే క్రమంలో మరొకరు మృతి చెందారు. కాగా, మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని.. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడితో పాటు 9 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 11 ఏళ్ల బాలుడు సహా మిగతా క్షతగాత్రులు ప్రస్తుతం తండా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా తహసీల్దార్ మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.25 వేలు అందించారు. ధర్మశాల మాజీ ఎమ్మెల్యే విశాల్ నైహరియా కూడా రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.