తెలంగాణ వాసులు రిస్క్ తీసుకోరు - మళ్లీ కేసీఆర్‌నే గెలిపిస్తారు : హరీశ్ రావు
🎬 Watch Now: Feature Video
Published : Nov 7, 2023, 11:10 AM IST
Harish Rao Interview : తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని.. సమర్థ నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం కోసం మళ్లీ కేసీఆర్‌నే గెలిపించుకుంటారని బీఆర్‌ఎస్ అగ్రనేత, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గోబెల్స్ ప్రచారంలో కాంగ్రెస్‌కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని.. ఆ పార్టీనే సృష్టిస్తోందని మండిపడ్డారు.
Harish Rao Latest Interview : ఈ ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులు ఒకవైపు.. తెలంగాణ వాదులు మరోవైపు ఏకమవుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎంపై ఇప్పటికీ తమకు గౌరవం ఉందని.. ఆ పార్టీలను మోసం చేసింది బీఆర్‌ఎస్ కాదని.. కాంగ్రెస్సేనని ఆరోపించారు. తమ ప్రత్యర్థుల ఎన్నికల పొత్తు.. వారి బలహీనతకు.. తమ బలానికి నిదర్శనమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో హంగ్ రావాలని కొందరు ఆశిస్తున్నారని.. అయితే వారికి నిరాశే మిగులుతుందని చెప్పారు.
నేడు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తారని మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. దానికోసమే హడావుడిగా మేడిగడ్డ బ్యారేజీపై నివేదిక తెప్పించుకున్నారని ఆరోపించారు. ఒక బ్యారేజీలో ఒక పిల్లరు పోతే.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పోయినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక కేవలం ఎన్నికల కోణంలో రాజకీయంగా బురద చల్లే కుట్రలో భాగమేనని హరీశ్ రావు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గల్లీ లీడర్ స్థాయికి దిగి.. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ తన వద్దకు వచ్చారని చెప్పడం హాస్యాస్పదం అంటున్న మంత్రి హరీశ్‌రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...