నీటి పైప్లైన్ పేలి మహిళ మృతి.. 50ఇళ్లు ధ్వంసం.. రూ.లక్షల్లో నష్టం - గౌహతి పైప్లైన్ పేలుడు
🎬 Watch Now: Feature Video

Guwahati water pipe burst : అసోంలోని గువాహటిలో నీటి పైప్లైన్ పేలడం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఖార్గులీ ప్రాంతంలో పైప్లైన్ పేలింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. 19 మందికి గాయాలయ్యాయి. 50 ఇళ్లు తుడిచిపెట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతురాలిని సుమిత్రా రాభాగా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Guwahati water burst : జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ ఈ వాటర్ పైప్లైన్లను నిర్మించింది. పైప్లైన్ పేలగానే నీరు భారీగా ఎగసిపడింది. ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో ఉన్న 300 మంది ఈ ఘటనతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
బాధిత కుటుంబాలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమస్యను పరిష్కరిస్తామని గువాహటి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (జీఎండీఏ) అధికారులు హామీ ఇచ్చారు. నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అథారిటీ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంస్థ చేపట్టిన నిర్మాణాల్లో నాణ్యతాలోపాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నీటి సరఫరా ప్రాజెక్టును 2012-13లో ఈ సంస్థకు కట్టబెట్టింది. ప్రతి ఇంటికి నీరు అందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2016 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉంది. కానీ, జేఐసీఏలో అనేక అవకతవకల కారణంగా ఇప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జేఐసీఏలో అవినీతి ఆరోపణలపై అసోం ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో విచారణకు ఆదేశించింది.