PRATIDWANI ఎందుకీ వరస ఆత్మహత్యలు.. అసలు నివారించలేమా..!
🎬 Watch Now: Feature Video
PRATIDWANI : గత కొన్ని రోజులుగా వరస ఆత్మహత్యలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి. కళాశాలలో వేధిస్తున్నారని ఒకరు. ప్రేమించమని వెంటాడుతున్నాడని మరొకరు.. బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. వేధింపులకు తాళలేక నిండు ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. కనీసం రెండు పదులు దాటని వయస్సులో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. అప్పుడే మొదలవుతున్న జీవితాలలో వెలుగులు నిండాల్సిందిపోయి.. మృత్యు చీకట్లు చేరుతున్నాయి. ఉన్మాదుల బాధను భరించలేక.. జీవితాలు ఒత్తిళ్లపొత్తిళ్లలో నలిగిపోతున్నాయి.
అప్పుడే లోకాన్ని పరిచయం చేసుకుంటున్న వారి నుంచి మొదలు.. నడి వయస్కుల వరకు, అన్ని వర్గాల్లోను అదే పరిస్థితి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. పెళ్లి చేసుకుని కట్టుకున్నవారితో.. పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన వారు కూడా ప్రాణాలను తీసుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. యువతలోనే ఈ సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యలు విద్యాసంస్థల్లో మరింత తీవ్రంగా ఉన్నాయి. అక్కడ బలవన్మరణాల సమస్య తారాస్థాయిలో ఉంది. అసలు జ్ఞానాన్ని సంపాదించుకుని.. జీవీతంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశతో చేరే, విద్యాసంస్థల్లో వేధింపులు ఎందుకు. చదువుల ఒడిలోనే ఒత్తిళ్లు ఎందుకు ఎదుర్కొంటున్నారు.
జాతీయ స్థాయిలో ఏటికేటా బలవన్మరణాలు పెరుగుతున్నాయి. 2021, 22 సంవత్సరాలలో విద్యార్థుల ఆత్మహత్యలు గరిష్ఠానికి చేరుకున్నాయి. ఎక్కువగా ఈ సంవత్సరాలలోని విద్యార్థులు బలవంతంగా ప్రాణాలను తీసుకున్నారు. కళ్లముందే ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. చేతికి అందివస్తున్న ఆశాదీపాలను కోల్పోయి.. తల్లిదండ్రులు తీరని వేదనకు గురవుతున్నారు. వారి వ్యథ వర్ణనాతీతంగా ఉంటోంది. బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కుటుంబాన్ని పెంచి పోషించాల్సిన చాలా మంది ప్రాణాలను తీసుకోవటం వల్ల.. కుటుంబ పెద్దను కోల్పోయి మరికొందరు క్షోభను అనుభవిస్తున్నారు.
ఉన్నది ఒకటే జిందగీ.. కానీ, కొందరు ఆ విషయాన్ని మరిచిపోయి అర్ధంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు సమాజానికి కొత్త కాకపోయినా.. ఇటీవల కాలంలో ఈ ధోరణులు ఎక్కువైపోయాయి. విద్యార్థులు, ఉద్యోగులు ఇలా ఎవరైనా కావచ్చు, చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లను, చిన్న చిన్న సమస్యలను తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడాల్సిన కారణాలేంటి. ఈ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి. యువతలో ధైర్యాన్ని నింపాలంటే ఏ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అంశాలపైనే నేటి ప్రతిధ్వని కార్యక్రమం. ఈ కార్యక్రమంలో విజయవాడ నుంచి డాక్టర్ మానస, సైకియాట్రిస్ట్.. హైదరాబాద్ నుంచి అర్చన, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ పాల్గొని వారి సలహాలు, సూచనలు అందించారు.