చిరుతతో శునకం భీకర పోరాటం- గ్రామసింహానిదే పైచేయి! - కుక్క చిరుత ఫైట్ లఖింపుర్ ఖేరీ
🎬 Watch Now: Feature Video


Published : Jan 13, 2024, 7:35 PM IST
Dog Leopard Fight Viral Video : శునకం, చిరుత భీకరంగా పోరాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో జరిగింది. దుధ్వా టైగర్ రిజర్వ్ నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత సంపూర్ణ నగర్ రేంజ్‌లోని మిర్చియాన్ గ్రామంలో ఓ కుక్కపై దాడి చేసింది. ఒక్కసారిగా మీదపడిన చిరుతతో శునకం సైతం గట్టిగానే పోరాడింది. ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు చిరుత ఆ శునకాన్ని వదిలేసి చెరకు చేనులోకి పారిపోయింది. ఈ ఘటన అంతా అక్కడి గురుద్వారాలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
ఇండో-నేపాల్ సరిహద్దులో మిర్చియాన్ గ్రామం ఉంది. దుధ్వా బఫర్ జోన్లో ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల తరచుగా చిరుతలు కనిపిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మేకలు, ఇతర చిన్న జంతువులను వేటాడేందుకు చిరుతలు గ్రామానికి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఇళ్ల మధ్యకు కూడా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ వెంటనే స్పందించి చిరుతను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చిరుత సంచారం నేపథ్యంలో స్థానికంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు బఫర్ జోన్ అటవీ శాఖ అధికారి (డీఎఫ్ఓ) శౌరీశ్ సహాయ్ తెలిపారు. స్థానికంగా నివసించే ప్రజలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.