రాజ్‌ఘాట్‌ను ముంచెత్తిన వరద.. భారీగా స్తంభించిన ట్రాఫిక్.. దిల్లీ పరిస్థితిపై ప్రధాని ఆరా
🎬 Watch Now: Feature Video
Delhi Floods Video : దేశ రాజధాని నగరంలో వరదలు తాజాగా రాజ్‌ఘాట్‌ను కూడా ముంచెత్తాయి. దిల్లీ రోడ్లపై కొనసాగుతున్న నీటి ప్రవాహం.. నగర నడిబొడ్డున తిలక్ మార్గ్‌లో ఉన్న సుప్రీంకోర్టు వరకు చేరింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. తాజా పరిస్థితుల గురించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను అడిగి తెలుసుకున్నారు.
యమునా నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దిల్లీలో వరద కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలు లోతు వరదలో ట్రక్కులు సైతం రోడ్డు మధ్యలోనే నిలిచిపోయాయి. రద్దీగా ఉండే ఐటీఓ రహదారిపై నీటి ప్రవాహం పెరగడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని సరాయ్ కాలే ఖాన్ సమీపంలో 42వ జాతీయ రహదారి నుంచి ఐపీ పైవంతెన వైపు వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
శుక్రవారం ఉదయం 8 గంటలకు యమునా నదిలో నీటి ప్రవాహం 208.42 మీటర్లు ఉండగా.. 10 గంటల వరకు 208.38 మీటర్లకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఐటీఓ నుంచి వస్తున్న నీరు పాత దిల్లీ నగర కాలువల్లోకి వెళ్తోంది. ఎర్రకోట చుట్టూ వరద ప్రవాహం వల్ల దిల్లీలోని కాలువలు పూర్తిగా నిండిపోయాయని దిల్లీ మంత్రి అతిషి తెలిపారు. ఇంద్రప్రస్థ వద్ద దెబ్బతిన్న నీటి రెగ్యులేటర్ బోర్ల మరమ్మతు పనులను.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రివాల్ పరిశీలించారు. వికాస్ భవన్ మీడియా పాయింట్ వద్ద వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం రాజకీయంగా అకట్టుకుంది.