దొంగతో కలిసి సీఎం భోజనం.. ముచ్చటిస్తూ.. వీపు తడుతూ.. - స్మగ్లర్‌తో మధ్య ప్రదేశ్ సీఎం విందు
🎬 Watch Now: Feature Video
ముఖ్యమంత్రి పక్కన కూర్చుని భోజనం చేశాడు ఓ దొంగ. విందులో పాల్గొని సీఎంతో ముచ్చటిస్తూ.. ఆహారాన్ని ఆరగించాడు. అతడెవరో తెలియని ముఖ్యమంత్రి.. భోజనం మధ్యలో.. దొంగ వీపును కూడా తట్టారు. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన కూర్చుని.. అరవింద్ గుప్తా అనే వ్యక్తి భోజనం చేశాడు. అరవింద్ కలప దొంగతనం కేసులో జైలుకెళ్లాడు. ముఖ్యమంత్రి పక్కన ఓ దొంగ కూర్చుని భోజనం చేయడం.. పలు విమర్శలకు దారితీసింది. ఇక్కడ భద్రత వైఫల్యం సృష్టంగా కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
సోమవారం సిద్ది జిల్లాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ పర్యటించారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజలతో కలసి విందులో పాల్గొన్నారు. ఆ సమయంలోనే భద్రత సిబ్బంది కళ్లుగప్పి అరవింద్ గుప్తా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ దొంగ ఇలా భద్రత సిబ్బందిని దాటుకుని ముఖ్యమంత్రి సమీపానికి వచ్చి.. కలిసి భోజనం చేయండంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా పంచాయతీ అధికారి, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కలప స్మగ్లింగ్ కేసులో జైలుకెళ్లిన దొంగ..
అరవింద్ గుప్తా.. ఏప్రిల్ 10న కలప దొంగతనం కేసులో జైలుకెళ్లాడు. రెండు రోజుల పాట జైల్లో ఉన్నాడు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. అటవీ చట్టం 1927లోని సెక్షన్లు 2, 26, 52 ప్రకారం.. పోలీసులు అరవింద్‌పై చోరీ, స్మగ్లింగ్ కేసులు పెట్టి జైలుకు పంపించారు.