Clash Between Chittanur Villagers and Police : నారాయణపేట జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసన.. పోలీసుల లాఠీఛార్జ్ - ఇథనాల్ కంపెనీ వద్ద టెన్షన్
🎬 Watch Now: Feature Video
Published : Oct 22, 2023, 5:25 PM IST
Clash Between Chittanur Villagers and Police : నారాయణపేట చిత్తనూరు ఇథనాల్ పరిశ్రమ రసాయన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడాన్ని నిరసిస్తూ.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎక్లాస్ పూర్ స్టేజీ వద్ద స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, గ్రామస్థులకు మధ్య జరిగిన ఘర్షణలో మక్తల్ సీఐ రాంలాల్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లు, సిబ్బంది సహా పలువురు స్థానికులకు గాయాలయ్యాయి. చిత్తనూరు ఇథనాల్ పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలను లారీల్లో తీసుకువెళ్లి చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో వదిలి వేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎక్లాస్ పూర్లో రెండు రోజుల కిందట ఓ లారీని పట్టుకుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. శనివారం రాత్రి సైతం రసాయన వ్యర్థాలతో కూడిన మరో లారీని పట్టుకున్నారు. ఆ లారీతో మరికల్- ఆత్మకూర్ రోడ్డుపై ధర్నాకు దిగారు.
Villagers Protest Against Ethanol Factory : రసాయన వ్యర్థాలను వాగుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, చెరువుల్లో వదలడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇథనాల్ పరిశ్రను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. రసాయన వ్యర్థాలను బైటకు వదలిన కంపెనీపై చర్యలు తీసుకునే వరకూ ఆందోళన విరమించేది లేదని ధర్నాకు దిగారు. ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ కూడా చేశారు. గ్రామస్థులు తిరగబడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా గ్రామస్థులకు సైతం గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.