నడిరోడ్డుపై కారు బీభత్సం.. అతివేగంతో 8 మందిని ఢీకొట్టి.. ఇద్దరి మృతికి కారణమై.. - మధ్యప్రదేశ్‌లో 8 మందిని ఢీకొట్టిన కారు
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో రోడ్డు మీద వెళ్తూ.. ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందౌర్‌లోని భన్వర్ కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమై కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం చేరవేశారు. కొందరు స్థానికులు కారును తగలబెట్టేందుకు సైతం యత్నించారు.
గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కారు వేగంగా రావడం, ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టడం వీడియోలో సృష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
కొద్ది రోజుల క్రితం.. ఉత్తరాఖండ్ రూర్కీలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ కారు పక్కనే వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఆ సమయంలో హరియాణా నుంచి ఓ బస్సు కారు వెనుకే వస్తుంది. అయితే ఆ బస్సు.. కారును ఢీకొట్టలేదు. దీంతో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన వారని తెలుస్తోంది.