బండి సంజయ్ అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆందోళనలు
bjp activists protest against to bandi sanjay arrest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ శ్రేణులు నిరసకు దిగారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాలరామారంలో సంజయ్‌ను ఉంచిన పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బొమ్మలరామారం వద్ద ధర్నా చేశారు. మరోవైపు బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వస్తోన్న బీజేపీ నేతలను పోలీసులు వరుసగా అరెస్టు చేస్తుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులకు..బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో విశ్వాసం పోతోందని బీజేపీ శ్రేణులు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగలో తొక్కి.. నిజాంలాగా నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశత్వాన్ని త్వరలోనే కాలం చెల్లనుందని జోస్యం చెప్పారు. బొమ్మలరామారం పోలీసు స్టేషన్ వద్ద భారీగా చేరిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.