కళ్లు చెదిరేలా విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న రామమందిరం- వీడియో చూశారా?
🎬 Watch Now: Feature Video
Published : Jan 8, 2024, 10:03 PM IST
Ayodhya Ram Mandir Night Video: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి శరవేగంగా సిద్ధమవుతోంది. సంప్రదాయ హంగులతో మందిర కట్టడాలు కనువిందు చేస్తున్నాయి. రాత్రివేళ రామాలయం మరింత శోభను సంతరించుకుంటోంది. అయోధ్య రామ మందిరం రాత్రివేళ చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఆలయ అందాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. గర్భగుడి లోపలి కట్టడాలు ఆధ్యాత్మిక శోభను మరింతగా ప్రకాశిస్తూ తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. మైమరిపింపజేస్తున్నాయి. ఆలయ స్తంభాలు, గోడలపై దేవతల బొమ్మలు అత్యంత అద్భుతంగా చెక్కారు. ఆలయ ప్రాంగణంలోని కుబేర్ కోటపై ఏర్పాటు చేసిన జటాయువు విగ్రహం రాత్రివేళ మరింతగా మెరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తోంది. రాజసం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన లైట్లు మందిర అందాన్ని మరింత పెంచాయి.
మూడు అంతస్తులుగా ఉండే రామమందిరంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. మందిరంలో మెుత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉంటాయని తెలిపింది. మెుదటి అంతస్తులో రామ దర్బార్ ఉంటుంది. గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆలయంలో నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తన అనే ఐదు మండపాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 22న రాములోరి విగ్రహా ప్రాణపత్రిష్ఠ జరగనుంది.