DGP on MP Family Kidnap: ఎంపీ కుమారుడిని కట్టేసి.. కత్తితో బెదిరించారు: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
DGP Rajendra Nath Reddy on Visakha MP Family Kidnap Case: విశాఖలో సంచలనం రేకెత్తించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబీకుల కిడ్నాప్‌నకు సంబంధించిన వివరాలను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ విషయం విశాఖ ఎంపీ అక్కడి సీపీ త్రివిక్రమ వర్శకి సమాచారం ఇచ్చారని తెలిపారు. ముగ్గురు నిందితులు ఎంపీ కుమారుడి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న వారిని బెదిరించారన్నారు. అనంతరం ఎంపీ కుమారుడ్ని ఇంట్లోనే కట్టేసి కత్తితో బెదిరించారని వివరించారు. ఆడిటర్ ఇంటికి రాగా అతనిని బెదిరించి నిందితులు డబ్బులు వసూలు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. రిషికొండలో బాధితులు ఉన్నట్లు ట్రేస్ చేశామని.. పోలీసులకు తెలిసిన విషయం కిడ్నాపర్లకు తెలియటంతో వారు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని వివరించారు. పద్మనాభపురం వరకూ వెళ్లి అక్కడ బాధితులను వదిలి నిందితులు అక్కడి నుంచి పారిపోయారని వెల్లడించారు. నిందితులు మొత్తం కోటీ 75 లక్షల రూపాయలు వసూలు చేశారని.. ఇప్పటి వరకు 86.5 లక్షలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. పోలీసులకు సమాచారం అందిన తక్షణమే స్పందించడం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా కాపాడగలిగామని డీజీపీ తెలిపారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని నేర ఘటనలను శాంతి భద్రతలతో ముడి పెట్టటం సరికాదన్నారు.