ఓటుకు నోటు.. రంగంలోకి దిగిన కలెక్టర్.. సినీ ఫక్కీలో ఛేజింగ్ - ఓటుకు నోటు పంపిణి పట్టుకున్న కలబురిగి ఐఏఎస్
🎬 Watch Now: Feature Video
కర్ణాటక కలబురగి జిల్లాలో ఓటుకు నోటు వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. ఓ పార్టీ అభ్యర్థి తరఫున ఓటర్లకు డబ్బు పంచుతున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఆ జిల్లా కలెక్టర్ సినీ ఫక్కీలో నిందితులను ఛేజ్ చేసి మరి పట్టుకున్నారు. నగరంలోని సంగమేశ్వర్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి కనిపించిన ఈ హైడ్రామాకి సంబంధించిన దృశ్యాలు రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
కలబురగి దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా సంగమేశ్వర్ కాలనీలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారంటూ కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై స్వయంగా ఆ జిల్లా కలెక్టర్ యశ్వంత్ గురుకర్ స్పందించారు. యంత్రాంగంతో కలిసి రంగంలోకి దిగారు. కలెక్టర్‌ను చూసిన నిందితులు కారులో ఉన్న నోట్ల కట్టలతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి వాహనాన్ని కలెక్టర్ కారు కూడా వెంబడించింది. ఎట్టకేలకు డబ్బులు పంచుతున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల కారులో బీజేపీ ఎన్నికల ప్రచార కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నగర పోలీస్ కమిషనర్ చేతన్, డీసీపీ ఆదూరు శ్రీనివాసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారే ఈ ఓటుకు నోటు వ్యవహారంలో ఇలా వ్యవహరించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం పోలింగ్ జరగనుంది.