అయోధ్య రామాలయానికి బాహుబలి 'తాళం'.. 400 కిలోల బరువు.. 10 అడుగుల ఎత్తు.. - 400 కిలోల తాళం అలీగఢ్ వీడియో
🎬 Watch Now: Feature Video
400 Kg Lock Made In Aligarh Uttar Pradesh : అయోధ్య రామమందిరానికి కానుకగా ఇవ్వడానికి ఓ భక్తుడు 400 కిలోల బాహుబలి తాళం తయారు చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద తాళం తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడ్డానని తెలిపాడు. దాని కోసం తాను దాచుకున్న పొదుపు అంతా ఖర్చు చేశానని చెబుతున్నాడు. అతడే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన కళాకారుడు సత్య ప్రకాశ్ శర్మ.
సత్య ప్రకాశ్ దాదాపు 45 ఏళ్లుగా తాళాలు తయారు చేస్తున్నాడు. అయితే, అయోధ్య రామమందిరానికి తాళం చేయాలని నిర్ణయించుకున్నాడు. దాన్నే తన జీవితాశయంగా పెట్టుకున్నాడు. అనంతరం 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో తాళం తయారు చేశాడు. కానీ కొంత మంది ఇంకా పెద్ద తాళం చేయమని సత్య ప్రకాశ్‌కు సలహా ఇచ్చారు. దీంతో తన దగ్గరున్న పొదుపు దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టి.. తన భార్య రుక్మిణి సహాయంతో బాహుబలి తాళం చేయడానికి పూనుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభానికి 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో తాళం, నాలుగు అడుగుల తాళం చెవి తయారు చేశాడు. అనంతరం దాన్ని అలీగఢ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించాడు. ప్రస్తుతం ఆ బాహుబలి తాళానికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు సత్య ప్రకాశ్.
శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో రామమందిరంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం తెలిపారు. దీని కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్నట్లు చెప్పారు. అయితే, ఈ తాళం విషయమై ట్రస్ట్ అధికారులు స్పందించారు. తమకు చాలా మంది భక్తుల నుంచి కానుకలు అందుతున్నాయని.. ఈ తాళం ఎక్కడ అవసరం వస్తుందో చూడాలని చెప్పారు.