మూడేళ్ల బాలుడు.. చుట్టూ 6 కుక్కలు.. ఒక్కసారిగా మీదపడి.. - పంజాబ్ లుథియానాలో కుక్కను కొట్టి చంపిన యువకులు
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లోని వాథోడా ప్రాంతంలో 3 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు విరుచుకుపడ్డాయి. రోడ్డు పక్కన వెళ్తున్న జీతు దుబె అనే బాలుడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఆ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడిపై కుక్కలు దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. కుక్కలు దాడి చేస్తున్న సమయంలో బాలుడు భయంతో కేకలు వేశాడు. కుమారుడి అరుపులు విని బయటకు వచ్చిన బాలుడి తల్లి రాళ్లతో కుక్కలను తరిమేసింది. దీంతో పెద్ద ప్రాణాపాయం తప్పినట్లయింది.
అచ్చం ఇలాంటి ఘటనే కొద్దిరోజుల క్రితం నాగ్పుర్లోనే జరిగింది. వరుస ఘటనలతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేగాక వీధికుక్కల బెడదను తక్షణమే కట్టడి చేయాలంటూ మున్సిపల్ శాఖను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వీధికుక్కలను పట్టుకునే క్రమంలో మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే జంతు ప్రేమికులపైనా కేసులు నమోదు చేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం నాగ్‌పుర్ నగరంలో దాదాపు లక్ష వరకు వీధి కుక్కలు ఉన్నాయి. 2018లో ఈ సంఖ్య 81 వేలుగా ఉండేది. నాగ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్ వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. అందుకే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఓ వీధికుక్క దాడి చేసిందనే కారణంతో దాన్ని హింసించి కొట్టి చంపారు కొందరు యువకులు. ఈ ఘటన పంజాబ్‌లోని లుధియానాలో జరిగింది. శునకాన్ని అత్యంత కిరాతకంగా హింసించి చంపిన దృశ్యాలు అక్కడే ఉన్న ఓ స్థానికుడు ఫోన్లో రికార్డు చేసి పీపుల్ ఫర్ యానిమల్ అనే జంతు సంరక్షణ సంస్థకు పంపాడు. దీని ఆధారంగా సంస్థ సభ్యుడు సాహ్నేవాల్‌తో పాటు మరికొంత మంది జంతు ప్రేమికులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అందరిపై దాడి చేస్తోందనే కారణంతోనే శునకాన్ని చంపామని ఐదుగురు నిందితులు చెప్పారు.