530 పేజీల 'బంగారు' రామాయణం.. రామనవమి రోజు మాత్రమే దర్శనం.. ఎంత బాగుందో!
🎬 Watch Now: Feature Video
గుజరాత్‌లోని సూరత్ జిల్లా భక్తులకు ఎవరికీ దొరకని అదృష్టం ప్రతిఏడాది దక్కుతోంది! అదేంటంటే.. 'బంగారు రామాయణం' దర్శనం. రాముడి జీవిత చరిత్రను తెలియజెప్పే వివిధ రకాల రామాయణాల గురించి అనేక కథనాలు విని ఉంటాము. కానీ, సూరత్‌లోని ఓ ఆలయానికి వెళ్తే ఏకంగా బంగారు రామాయణాన్ని చూడవచ్చు. ఈ అరుదైన రామాయణం ప్రత్యేకత ఏంటంటే.. అందులో ఉన్న అక్షరాలను 19 కిలోల బంగారంతో తయారు చేశారు. ఈ బంగారు మహా కావ్యాన్ని రచించేందుకు 530 పేజీలను ప్రత్యేకంగా జర్మనీ దేశం నుంచి తెప్పించారు నిర్వాహకులు. అంతేకాకుండా ఆ రామాయణాన్ని రాసేందుకు ఏకంగా 222 తులాల బంగారు సిరా (ఇంక్)ను వినియోగించారు. దీని బరువు సుమారు 19 కిలోల వరకు ఉంటుంది. వీటితో పాటు 10 కిలోల వెండి, 4 వేల వజ్రాలు, కెంపులు, పచ్చలు, నీలమణులతో ఈ బంగారు రామాయణాన్ని చూడముచ్చటగా అలంకరించారు. ఈ 'బంగారు రామాయణం' విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ రామాయణం ప్రధాన పేజీలో ఒక తులం బంగారంతో చేసిన శివుడి విగ్రహంతో పాటు అరతులం స్వర్ణంతో చేసిన హనుమంతుడి విగ్రహాన్ని కూడా అమర్చారు.
ఈ రామాయణ మహా కావ్యాన్ని రచించేందుకు 1981లో రామ్ భాయ్ అనే భక్తుడు ప్రత్యేకించి పుష్య నక్షత్రంలో శ్రీకారం చుట్టాడు. దీనిని రాయడానికి మొత్తం 9 నెలల 9 గంటల సమయం పట్టింది. ఈ రామాయణ మహాయజ్ఞంలో మొత్తం 12 మంది రామభక్తులు పాల్గొన్నారు. ఈ రామాయణంలో శ్రీరాముడి నామాన్ని 500 లక్షల సార్లు రాయడం విశేషం. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ రామాయణాన్ని నీటితో కడిగినా అస్సలు చెక్కుచెదరదట. వీటి పేజీలను చేతితో తాకినా మరక కూడా పడకపోవడం దీని మరో ప్రత్యేకత. ఈ రామాయాణ మహా కావ్యాన్ని శ్రీరామ నవమి రోజున మాత్రమే భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. దర్శనానంతరం దీనిని ప్రత్యేక బ్యాంకులో భద్రపరుస్తారు. ఇక రెండో సారి బంగారు రామాయణాన్ని దర్శించుకోవాలి అనుకుంటే మాత్రం వచ్చే ఏడాది శ్రీరామ నవమి వరకు ఎదురు చూడాల్సిందే!