171 Kg Bahubali Roti : 171 కిలోల 'బాహుబలి రొట్టె'.. గిన్నిస్ రికార్డులో చోటు కోసం యత్నం - jumbo roti in bhilwara rajasthan
🎬 Watch Now: Feature Video
Published : Oct 8, 2023, 10:47 PM IST
|Updated : Oct 8, 2023, 11:05 PM IST
171 Kg Bahubali Roti In Rajasthan : రాజస్థాన్‌లోని భిల్వాఢా జిల్లాలో ఏకంగా 171 కిలో బరువుగల భారీ రొట్టెను తయారు చేశారు. 21 మందితో కూడిన ఓ మిఠాయి బృందం ఈ రొట్టెను రూపొందించింది. సుమారు ఐదున్నర గంటలపాటు శ్రమించి దీనిని తయారు చేసింది. అనంతరం దీనిని జిల్లాలోని హరి సేవా ఉదాసిన్ ఆశ్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, రాజస్థానీ జనమంచ్ జిల్లా అధ్యక్షుడు కైలాష్ సోనీ తన పుట్టినరోజు సందర్భంగా ఈ జంబో రొట్టెను తయారు చేయించారు.
ఈ రోట్టెను తయారు చేసేందుకు ముందుగా 2,000 మట్టి ఇటుకలను పేర్చి ఓ కొలిమిని సిద్ధం చేశారు. ఈ ప్రక్రియలో 1,000 కిలోల బొగ్గును ఉపయోగించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు చెందిన మొత్తం 21 మంది మిఠాయి తయారీదారుల బృందం ఈ భారీ రొట్టెను తయారు చేసింది. మొత్తం 180 కిలోల పిండిని రొట్టె కోసం వినియోగించారు. ఇందులో 110 కిలోల గోధుమపిండి, 10 కిలోల మైదా, 10 కిలోల దేశీ నెయ్యి ఉన్నాయి. ఈ పిండిని రోట్టె ఆకారంలోకి మార్చేందుకు 20 అడుగుల స్టీల్ పోల్‌తో వత్తారు. 1000 కిలోల బరువు ఉండే పెనంపై ఈ రొట్టెను కాల్చారు. దీని వెడల్పు 11x11 అడుగులు కాగా.. మందం 70 మిల్లిమీటర్లు. ఇక ఈ భారీ రొట్టె తయారీ ప్రక్రియను వీడియో కూడా తీశారు. దీనిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం పంపనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. అలాగే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు.