భారత్లో రాగి పాత్రలను ఆస్తిలో భాగంగా పరిగణించారు. రాగిని ప్రాచీన భారతీయులు గనుల నుండి సంగ్రహించారు. రాజస్థాన్లోని ఖేత్రీ గనులు ఇందుకు నిదర్శనం. రాగి చక్కటి ఉష్ణ వాహకత్వం కలిగి ఉండటంతో వంటలు చేయడం, దీర్ఘకాలం పాటు ఆహారాన్ని వేడిగా ఉంచడం సులభం. ఇత్తడి (రాగి, యశదం), కంచు (రాగి, తగరం) పాత్రలను సుదీర్ఘకాలంగా ఇంట్లో వాడుతున్నాం.
అల్ప ప్రమాణంలో, రోజుకు 1 మి.గ్రా. కంటే తక్కువ, రాగి మన శరీర అవసరాలకు సరిపోతుంది. అధిక ప్రమాణంలో తక్కువ సమయంలో రాగిని తీసుకున్నా, దీర్ఘకాలంలో ఎక్కువ రాగి శరీరంలోకి చేరినా అది విషంగా మారుతుంది. దీనివల్ల విరేచనాలు, తలనొప్పి, వాంతిలో రక్తం రావడం, కళ్లు రాగి రంగులోకి మారడం, చివరకు మూత్రపిండాలు చెడిపోవడం జరగవచ్చు. కొన్ని జన్యు కారణాల వల్ల కలిగే విల్సన్ వ్యాధిలో శరీరంలో అక్కడక్కడ రాగి పేరుకుని మృత్యువుకు దారితీయవచ్చు.
రాగి పాత్రల్లో వంట అంత శ్రేయస్కరం కాదు. ఉప్పు వల్ల రాగి ఎక్కువగా ఆహారంలో కలుస్తుంది. అందువల్ల రాగి పాత్రల్లో తగరం పైపొరగా ఉంటుంది. తగరం, రాగి చక్కగా కలిసిపోతాయి. అయినా ఆమ్లత వల్ల, పాత్రలు కడిగేటప్పుడు గోకడం వల్ల పై పొర దెబ్బతింటుంది. అందువల్ల వీటిలో వంట చేయడం, ఆహారాన్ని నిల్వ చేయడం మంచిది కాదు. ఇత్తడి పాత్రలు బరువు కూడా ఎక్కువ. ఇత్తడి పళ్లెంలో భోజనం చేయవచ్చు కానీ వంట చేయడం మంచిది కాదు.
శరీరంలో రాగి లోటు చాలా అరుదు. ఒకవేళ లోపిస్తే కింది లక్షణాలు కనిపిస్తాయి.
- అలసట, బలహీనత
- బోలు ఎముకలు
- జ్ఞాపక శక్తి లోటు
- నడవటంలో ఇబ్బంది
- చలి ఎక్కువగా ఉండటం
- పాలిపోయిన చర్మం
- చూపు తగ్గడం
సూక్ష్మ పోషక ద్రవ్యంగా రాగి మనకు చాలా అవసరం. రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిలో బ్యాక్టీరియాలు నశించిపోవటం వల్ల రాగి మనకు ఉపయోగమే. రాగి వల్ల ఎముకలు, నాడులు బలపడుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారం నుంచి ఇనుము చక్కగా శోషణ అవుతుంది. డ్రైఫ్రూట్స్, పుట్టగొడుగులు, కాలేయం (మాంసాహారం) లో అధిక మోతాదులో రాగి లభిస్తుంది.