భువనగిరిలో విశ్వాసం నెలకొనేనా...?
భువనగిరి పురపాలిక పరిధిలో 60 వేల జనాభా ఉంది. ఎన్నికల ప్రకటన వెలువడుతుందనగానే... హడావుడిగా రహదారులు వేశారు. బైపాస్ సమీపంలో కొత్తగా ఏర్పడ్డ కాలనీల్లో... అంతర్గత రహదారులు కానీ, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటే కాలేదు. ఆర్నెల్ల క్రితం ఒకే రోజు 10 శంకుస్థాపనలు చేసి రూ.8 కోట్ల ప్రతిపాదనలతో పనులు చేస్తామని చెప్పినా అతీగతీ లేకుండా పోయింది. 1952లో భువనగిరి పురపాలికగా ఆవిర్భవించగా... మొత్తం 35 వార్డులకు గాను 44 వేల 240 మంది ఓటర్లున్నారు. ఛైర్మన్లుగా ఎన్నికైన వారందరూ ప్రతీసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. ఈసారైనా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి బాటలో నడిపించాలని భువనగిరి వాసులు కోరుకుంటున్నారు.
కొండపై సరే... మరి కింద పరిస్థితేంటి..?
ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్ట మేజర్ పంచాయతీ నుంచి పురపాలికగా ఏర్పడింది. 17 వేల 210 మంది జనాభాకు గాను 13 వేల 275 మంది ఓటర్లున్నారు. తాగునీటి సమస్య, మురుగునీటి కాల్వలు సరిగా లేక సమస్యలు తలెత్తుతున్నాయి. నిత్యం వేలాది మంది యాత్రికులు వస్తుండటం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ కూడా మెరుగుపడాల్సి ఉంది. పురపాలిక ఏర్పడ్డప్పటి నుంచి రూ.20 కోట్ల నిధులు మంజూరైనా ఎక్కడా పనులు జరగలేదు. వందలాది కోట్లతో యాదాద్రి అభివృద్ధి జరుగుతున్నా... పట్టణాభివృద్ధిని మాత్రం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోచంపల్లిలో పారిశుద్ధ్యలోపం...
పట్టు చీరలకు, ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి కొత్త పురపాలికగా అవతరించింది. 17 వేల 79 మంది జనాభాకు గాను 14 వేల 176 మంది ఓటర్లున్నారు. 13 వార్డులకు గానూ ఇప్పటివరకు మురికివాడల గుర్తింపే జరగలేదు. ఏటా రూ.కోటీ 30 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా... రూ. 50 లక్షలే వసూలవుతోంది. పారిశుద్ధ్య నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉందని పెదవి విరుస్తున్నారు స్థానికులు.
చౌటుప్పల్లోనూ చీత్కారాలే...
హైదరాబాద్-విజయవాడ రహదారిపైన గల చౌటుప్పల్లో... 31 వేల 202 మంది జనాభాకు గాను 22 వేల 164 మంది ఓటర్లున్నారు. స్థిరాస్తి రంగం, ఔషధ పరిశ్రమలతో ఏటా వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. మిషన్ భగీరథ పైలాన్ చౌటుప్పల్లో నిర్మించటం వల్ల ఈ పట్టణం జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. 18 వార్డులు ఉండగా అన్ని చోట్లా సమస్యలే దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, రవాణా వ్యవస్థ సరిగాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు.
ఆలేరు, మోత్కూరులోనూ అదే దుస్థితి...
ఆలేరులోనూ ఎన్నో సమస్యలు దర్శనమిస్తున్నాయి. పురాతన భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఆలేరు అతిథి గృహంలో పెచ్చులూడి... ఎమ్మెల్యేతోపాటు నలుగురికి తీవ్రంగా గాయాలయైన సందర్భాలూ ఉన్నాయి. మోత్కూరు పురపాలికలో 12 వేల 610 మంది ఓటర్లు... 15 వేల 924 మంది జనాభా ఉన్నారు. డంపింగ్ యార్డు లేక చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారబోస్తున్నారు. బుజిలాపురం, కొండగడప గ్రామాలు విలీనం కాగా... ఆయా పల్లెల్లోనూ అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. సీసీ రహదారులు, మురికి కాల్వలు సరిగా లేని దుస్థితి నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగరితో పాటు కొత్తగా ఏర్పడిన ఐదు పురపాలికల్లో సమస్యలు తాండవిస్తుండగా... ఇప్పుడు ఎన్నికయ్యే పాలకవర్గమైనా పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు.
- ఇదీ చూడండి:'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు