Daughter left her mother in Bus Shelter: సమాజంలో నానాటికీ మానవ సంబంధాలు దిగజారుతున్నాయి. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డకు.. ఆ తల్లి బరువైంది. అన్ని తానే అనుకుని కూతురునే కొడుకులా భావించిన ఆ వృద్ధురాలు.. బస్సు షెల్టర్‌లో తలదాచుకునే దుస్థితి వస్తదని ఊహించలేకపోయింది. తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కుమార్తెకు రాసిచ్చింది. కానీ వృద్ధాప్యంలో తల్లిని భారంగా భావించి వృద్ధాశ్రమంలో చేర్పించి ఆ కుమార్తె అటువైపు కన్నెత్తి చూడలేదు.
నెలనెలా డబ్బు ఇవ్వనిదే వృద్ధురాలిని చూడలేమంటూ నిర్వాహకులు తిరిగి ఆమెను సొంతూరికి పంపారు. సొంతూరులో ఇల్లు లేక, కుమార్తె ఆదరించక.. ఇలా బస్సు షెల్టర్‌లో ఉంటున్నారు. సర్కారు ఇచ్చే రూ.2 వేల ఫించనే తనకు ఆధారమని కన్నీటి పర్యంతమవుతూ తన గోడును వెళ్లబోసుకుంది. ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలికి పోలీసులు చేయూతనందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌లో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలికి పోలీసులు చేయూతనందించారు. ఏడాదిగా బస్సు షెల్టర్‌లో తలదాచుకుంటున్న వృద్ధురాలు గొర్రె మార్తను అన్ని విధాలా ఆదుకుంటామని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. వృద్ధురాలి దయనీయ పరిస్థితిపై "ఆస్తి తీసుకొని... అమ్మను వదిలేసింది" అనే శీర్షికన ఈటీవీ భారత్లో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. బస్ షెల్టర్ వెనక వృద్ధురాలికి గ్రామస్తుల సహకారంతో... ఒక గది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రెండేళ్ల క్రితం భర్త చనిపోయాక ఒంటరైన వృద్ధురాలు... యోగక్షేమాలు చూసుకుంటుందని ఇంటిని, ఎకరంన్నర పొలాన్ని ఒక్కగానొక్క కూతురికి ఇచ్చేసినట్లు తెలిపింది. ఆస్తులు అమ్ముకుని మార్తను కుమార్తె వృద్ధాశ్రమంలో చేర్చి చేతులు దులుపుకుంది. డబ్బు ఇవ్వనిదే చూసుకోలేమంటూ నిర్వాహకులు... ఆమెను సొంతూరుకు పంపారు. సొంతూరులో ఇల్లు లేక, కుమార్తె ఆదరించక బస్ షెల్టర్‌లో వృద్ధురాలు తలదాచుకుంటోంది.
ఇవీ చదవండి: