హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో విజయం కోసం... తెరాస, కాంగ్రెస్ విస్తృత ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ముఖ్య నేతలు... ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా కనిపించే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... సతీమణిని గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అధికార పార్టీ కంటే మిన్నగా ఉత్తమ్... ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఆధిపత్యంకై ఆరాటం
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... నియోజకవర్గంలోని అన్ని మండలాలను చుట్టి వస్తున్నారు. ఉదయమంతా హుజూర్ నగర్ వేదికగా కార్యక్రమాలు... సాయంత్రం నుంచి రాత్రి వరకు పల్లెల సందర్శన... అర్ధరాత్రి అక్కడే బస అన్న తీరుగా పర్యటన చేపడుతున్నారు. కలిసొచ్చే వారిని కలుపుకొని పోవడం ఒకెత్తయితే... ఇతర పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి నాయకుల ద్వారా తమకు అనుకూలంగా ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాలు మరొక ఎత్తుగడ అని అక్కడివారు చర్చించుకుంటున్నారు. గత మూడు దఫాలుగా విజయం సాధించి సెగ్మెంట్‌ను కంచుకోటగా మార్చుకున్న ఉత్తమ్... ఇపుడు సతీమణిని గెలిపించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచాలన్న తపనతో కనిపిస్తున్నారు.
నియోజకవర్గానికి నేడు కీలక నేతలు
అధికార పార్టీ తరఫున ఇప్పటివరకు మంత్రి జగదీశ్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాత్రమే... ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరికొంత మంది కీలక నేతలు నేడు హుజూర్నగర్ చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి... శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ నియోజకవర్గాన్ని చుట్టి వస్తారన్న భరోసాతో తెరాస శ్రేణులున్నాయి.
అసంతృప్తులపై దృష్టి
తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సైతం... ఊరూరా తిరుగుతున్నారు. ఉత్తమ్ అసంతృప్తులపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు కనపడుతోంది. ఉమ్మడి మండలాల వారీగా కేటీఆర్ రోడ్ షోలు ఉండేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. పోలింగ్‌కు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం... తెరాస సీనియర్ నేతల్లో కనిపిస్తోంది. స్థానిక నేతల సాయం కోరుతూ సైదిరెడ్డి... పలువురితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి... మేళ్లచెరువులో నిర్వహించిన సభలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. పాలకవీడు జడ్పీటీసీ తెరాసలో చేరడంతో... ఉత్తమ్ తీవ్రస్థాయిలో స్పందించారు. హుజూర్‌నగర్‌లో సమావేశం ఏర్పాటు చేసి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
వ్యూహ ప్రతి వ్యూహాలు
హుజూర్నగర్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా... సీటు దక్కించుకోవాలన్న కసితో వ్యూహాలు రచిస్తున్నాయి. ఒకరి వైఫల్యాలను మరొకరు ఎండగడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
- ఇదీ చూడండి : నేడు హుజూర్‌నగర్‌కు గులాబీ సైన్యం