సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెళ్లి గ్రామంలో సుమారు 60 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పాఠశాల ఉనికి ప్రమాదంలో పడింది. ఈ పరిణామం పాఠశాలలో చదివిన పూర్వవిద్యార్థులను కలవరపాటుకు గురిచేసింది. అందరూ ఒక్కటై వరుస సమావేశాలు ఏర్పాటు చేసి ఓ నిర్ణయానికి వచ్చారు. పక్క గ్రామంలోని పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను రప్పిస్తే మూతపడకుండా ఉంటుందని యువకులంతా కలిసి గ్రామ సర్పంచ్ సహకారం కోరారు. సర్పంచ్ వెంటనే స్పందించి బడిబాట కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరారు. వారికి చక్కటి విద్యాబోధన అందుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు సర్పంచ్ యాకయ్య.
గతంలో 150 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో గత సంవత్సరం నుంచి 40 మంది విద్యార్థులు చదువుతుండగా ఈ ఉద్యమం వల్ల నేటికి 105కి పెరిగింది.
ఎలా సాధ్యమైంది:
మన ఊరు మన బడి కార్యక్రమానికి గ్రామ యువకులంతా కలసి సహాయం కోరగా గ్రామ సర్పంచ్ వల్లపు యాకయ్య గ్రామ పంచాయతీలో ఓ తీర్మానం చేశారు. గ్రామానికి ప్రైవేటు పాఠశాల బస్సులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ పాఠశాలలో కూడా ఆంగ్లంలోనే చక్కగా బోధిస్తారని చెప్పడం వల్ల తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పిస్తున్నారు.
ఉపాధ్యాయుల పాత్ర:
బడి బాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్‌తో కలసి గ్రామంలో ప్రతిరోజు తిరిగి తల్లిదండ్రులలో ప్రభుత్వ బడుల గురించి అవగాహన కల్పించారు. మీ పిల్లల భవిష్యత్ మాకు వదిలేయండి, ఒక్క నెల రోజులు బడికి పంపించండి పిల్లల చదువులో, ఇంగ్లీష్‌లో ఎంత మార్పు వస్తుందో గమనించండి అని వారు తల్లిదండ్రులను కోరారు. పిల్లలను ఆంగ్లంలో ప్రావీణ్యులను చేసే బాధ్యత తమదేనని.. అవసరమైతే బాండ్ పేపర్ రాసి ఇస్తామని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
విద్యార్థులు పెరగడం వల్ల కొత్తసమస్య:
విద్యార్థులు పెరిగారు కాని అందరికి సరైన విద్యను అందించాలంటే ఉపాధ్యాయుల సంఖ్య పెంచాల్సి ఉంటుందని పూర్వవిద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో కలసి ముగ్గురు ఉపాధ్యాయులున్నారని వెల్లడించారు. గ్రామ సర్పంచ్ ఒకరిని , పూర్వవిద్యార్థులు మరొకరిని విద్యావాలంటీర్లను అందించారని అయినా సరిపోవడం లేదని.. ఇంకా ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తే బాగుంటుందని వారు అంటున్నారు.
అధికారులు వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి విద్యార్థులకు చక్కటి విద్యాబోధన అందేలా చూడాలని పాఠశాల పూర్వవిద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: నిండుకుండలా మేడిగడ్డ... అన్నారంకు గోదారమ్మ