Padmavathi Brahmotsavam 2024 : తిరుమల శ్రీనివాసునికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగినట్లే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా ప్రతి ఏడాది కార్తిక మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 28వ తేదీ ఉదయం జరగనన్న ధ్వజారోహణం, సాయంత్రం జరుగనున్న చిన శేష వాహనం విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
"న భూతో న భవిష్యతి" ధ్వజారోహణ ఉత్సవం
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి కార్తిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో వైభవంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ధ్వజారోహణం కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో ధ్వజారోహణం ఎలా జరుగుతుందంటే?
ధ్వజారోహణం ఉత్సవం ఇలా!
ధ్వజారోహణం ఉత్సవం సందర్భంగా గురువారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అమ్మవారిని, ధ్వజపటాన్ని తిరుమాడ వీధుల్లో ఊరేగించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీరుస్తారు. అనంతరం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ధనుర్లగ్నంలో 9.40 గంటలకు ఆగమ శాస్త్ర పండితుడు తిరుమలాచార్య ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, అష్టదిక్పాలకులను, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమ్మవారికి స్నపన తిరుమంజనం కనువిందుగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ జరుగుతుంది.
చిన్నశేష వాహన సేవ
రాత్రి 7 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారిని వాహన మండపానికి తీసుకొచ్చి చిన్నశేష వాహనంపై కొలువుదీరుస్తారు. అనంతరం పట్టు పీతాంబరం, వజ్ర వైఢూర్య ఆభరణాలతో అమ్మవారిని పిల్లనగ్రోవి చేతపట్టిన గోపాలకృష్ణుడి రూపంలో అలంకరిస్తారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం పై అమ్మవారిని తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా తిరుమాడ వీధులు భక్తుల కోలాటాలు, కేరళ సంప్రదాయ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, జీయర్ స్వాముల ప్రబంధాలతో కోలాహలంగా ఉంటుంది. భక్తజన సందోహం నడుమ అమ్మవారు తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. చిన శేషవాహనంపై ఊరేగే శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శిస్తే సమస్త నాగ దోషాలు పోయి వివాహం సంతానం వంటి శుభ ఫలితాలను పొందవచ్చునని శాస్త్ర వచనం. ఆ పద్మావతి అమ్మవారి అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ చిన్నశేష వాహనం పై ఊరేగే శ్రీ పద్మావతి అమ్మవారికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.