Smart Kitchen Gadgets : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కోసారి చిన్న పనులు కూడా పెద్దవే అనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది వంటంతా ఒంటిచేత్తో ఈజీగా చేస్తుంటారు. కానీ, అదే ఏమైనా పగలకొట్టాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే, ఇకపై ఆ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పనిలేదు. ఎందుకంటే మార్కెట్లో అలాంటి పనులను తేలిక చేసేందుకు కొన్ని చిన్న చిన్న పరికరాలు లభిస్తున్నాయి. అవి మీ ఇంట్లో ఉంటే శ్రమలేకుండా ఆయా పదార్థాలను ఈజీగా పగలగొట్టొచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టూల్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గుడ్డు పగలగొట్టడం ఈజీ!
కొంతమంది కోడిగుడ్డు పగలగొట్టేటప్పుడు ఆ సొన కిచెన్ గట్టుపై వంపేస్తుంటారు. ఇక పిల్లలు ఆమ్లెట్ వంటివి తామంతట తామే వేసుకోవాలని ట్రై చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు గుడ్డుని పగలగొట్టడం రాక నేలపై పడేస్తుంటారు. అదే మీ కిచెన్లో "ఎగ్ క్రాకర్" ఉంటే ఆ భయం ఉండదు. ఎగ్ని దాంట్లో పెట్టి దానికున్న స్టీల్ బ్లేడ్‌లను నొక్కితే చాలు. ఈజీగా గుడ్డు పగిలిపోతుంది. పైగా సొన కాస్తకూడా చేతికి అంటకుండా, కిందపడకుండా సులువుగా వంట చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
కొబ్బరి తీయడం సులువే!
కొబ్బరితో ఏదైనా వంటకాలు చేసుకునేటప్పుడు టెంకాయ పగలగొట్టడం, పెంకు తీయడం కాస్త శ్రమతో కూడుకున్న పని. కానీ, అదే మీ వంటింట్లో "కోకోనట్ స్లైసర్" టూల్ ఉంటే ఆ పని ఈజీగా పూర్తయిపోతుంది. మందపాటి స్పూన్‌లా కనిపించే ఈ పరికరం ఇనుముతో తయారైనందున మన్నిక ఎక్కువే. దీంతో సులువుగా కొబ్బరికాయను పగలగొట్టి, కొబ్బరి తీయొచ్చు. అలాగే.. వేళ్లకి గాయమౌతుందో, గచ్చు పగులుతుందో అన్న బెంగ కూడా ఉండదట.
ఈ గరిటెతో ఇక ఆయిల్ మీపైన పడదు! - ఈ లేటెస్ట్ "కిచెన్ టూల్స్"తో ఎంతో ఉపయోగం!
వాల్‌నట్స్ కోసం..
చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వాల్నట్స్ని డైలీ డైట్లో భాగం చేసుకుంటున్నారు. కానీ, వాటి పెంకు గట్టిగా ఉండి, పగలగొట్టడానికి కష్టంగా ఉంటుంది. అయితే, వాల్‌నట్స్ పగలగొట్టడానికి ఇకపై ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మార్కెట్లో అందుబాటులో ఉన్న "నట్ క్రాకర్"తో ఆ పని చాలా ఈజీ. ఈ పరికరంలో ఉన్న చిన్న, మధ్యస్థం, పెద్ద సైజుల్లోని వాల్‌నట్స్ పగలగొట్టేలా నిర్మాణాలుంటాయి. అంతేకాదు.. చూడ్డానికి కటింగ్ ప్లేయర్‌లా కనిపించే ఈ క్రాకర్‌ను చిన్నచిన్న క్యాన్‌లు, బాటిళ్ల మూతలు తీయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.
కొబ్బరినీళ్లకూ..
ఇంటికి కొబ్బరిబోండాలు తెచ్చుకున్నప్పుడు దాని నుంచి వాటర్ తీయడం ఓ టాస్క్. కానీ, మీ ఇంట్లో "కోకోనట్ ఓపెనర్" ఉంటే ఆ పని చాలా ఈజీ. ఇది చూడ్డానికి స్టవ్ లైటర్‌లా ఉంటుంది. దీని బటన్‌ను వెనక్కి లాగి, కొబ్బరిబోండంపై రంధ్రం చేస్తే చాలు. ఈజీగా రంధ్రం పడుతుంది. పైగా గ్రిప్‌కూడా ఉండడంతో చేతికీ నొప్పి అనిపించదు. ఆపై స్ట్రా లేదా గ్లాసులో వంపేసి తాగొచ్చంటున్నారు నిపుణులు.
చుక్క లేకుండా నిమ్మరసం పిండొచ్చు- సెకన్లో రెండు కజ్జీకాయలు చేయచ్చు- ఈ కిచెన్ టూల్స్ చూశారా?