Nirmal Collector on Ethanol Industry works : నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇథనాల్ పరిశ్రమ అనుమతులు, షరతులు, స్థానికుల ఆందోళనపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కు నివేదిక ఇచ్చారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులను పునః సమీక్షించాలని సర్కారు నిర్ణయించింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని స్థానికంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అవసరమైతే పరిశ్రమ అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా ప్రభుత్వ సూచనల మేరకు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అంతకముందు ఇవాళ ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు చేపట్టిన నిరసనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేయగా వారు పరుగులు తీశారు. ఈ ఆందోళనలో మహిళలు సైతం పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలంటూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నవంబర్ 26న కూడా జాతీయ రహదారిపై రాస్తారోకో చేయగా అక్కడికి వచ్చిన ఆర్డీవోను అడ్డుకుని కారు దహనానికి యత్నించారు. దీంతో కొద్దిసేపటి వరకు అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది.
ఆందోళన విరమించిన గ్రామస్థులు : మంగళవారం సాయంత్రం వరకు గ్రామస్థులు రహదారిపైనే వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనం చేశారు. రాత్రి కూడా సెల్ఫోన్ల వెలుతురులో సైతం నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల ఆందోళనలపై స్పందించిన కలెక్టర్ సీఎం కార్యాలయం(సీఎంవో)కు నివేదిక పంపినట్లు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆందోళనకారులు సైతం నిరసన విరమించి ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
గత కొన్ని నెలలుగా నిరసనలు : నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని గత కొన్ని నెలలుగా స్థానిక ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే తమ పంట పొలాలతోపాటు పాటు అక్కడి పర్యావరణం సైతం దెబ్బతింటుందని గ్రామస్థులు వాపోయారు. ఈ నిరసనలో చిన్నారులు, వృద్ధులు మహిళలు సైతం పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఆందోళన విరమించిన గ్రామస్థులు, ప్రభుత్వం నిర్ణయంపై తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు.
ఇథనాల్ పరిశ్రమ నిరసనలో తీవ్ర ఉద్రిక్తత - పోలీసులపై ఆందోళనకారుల దాడి