భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాననని జనసేనాని పునరుద్ఘాటించారు. తెలంగాణ గడ్డ తనకు ధైర్యం ఇచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలకు తాను రుణపడి ఉన్నానన్నారు.
నా ఆధీనంలో లేవు...
"సామాజిక మార్పు జరగాలంటే.. ఎంతో ప్రసవవేదన పడాలి. దేశానికి ఖనిజ గనులు, అరణ్యాలు, నదులు.. కాదు సంపద.. కలల ఖనిజాలతో చేసిన యువతే అసలు సంపద. అడుగు వేస్తే తప్ప.. అనుభవం రాదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. గెలుస్తానా.. లేదా అనేది నేను ఆలోచించలేదు. కష్టాల్లో ఉన్న వాళ్లకు అండగా ఉండగలనా అనేది మాత్రమే ఆలోచించాను. రాజకీయాల్లోకి వస్తుంటే అందరూ నన్ను భయపెట్టారు. 2009లో రాజకీయాలు నా అధీనంలో లేవు. అప్పుడు పార్టీ వేరొకరి చేతిలో ఉంది. రాజకీయ చదరంగంలో జనసేనది సాహసోపేత అడుగు.అన్ని పరిణామాలకు సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది. రాజకీయాలకు బలమైన భావజాలం ఉంటే చాలు. " - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
ఏమి లేదనుకున్న జనసేన ఇప్పుడు కొన్ని వేల పంచాయతీలు, కొన్ని ఎంపీటీసీలు గెలిచి చూపించిందని పవన్ తెలిపారు. అధికారం, పరపతి.. పేద ప్రజల కన్నీళ్లు తుడవలేనప్పుడు ప్రయోజనమేముందని ప్రశ్నించారు. సామాజిక న్యాయం పేరుతో వచ్చిన ప్రజారాజ్యం పార్టీని నిలబెట్టలేకపోయానని ఎన్నో రోజులు బాధపడినట్టు తెలిపారు. ఎన్నో దశాబ్దాలు కొట్లాడితే గానీ తెలంగాణ రాలేదని.. అలాంటిది సామాజిక న్యాయం కోసం ఇంకెంత పోరాడాలన్నారు.
జనసేన సిద్ధాంతాలివే...
"నేను అన్ని కులాలను గౌరవించేవాన్ని. రెచ్చగొట్టేవాన్ని కాదు. మన హక్కులు ఎదుటివాళ్ల హక్కులకు భంగం కలిగించనంతవరకే. అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగం మనకు కల్పించింది. భాషలను గౌరవించాలన్న సంప్రదాయం మనది. "నారాజు గాకురా మా అన్నయ" అని రాశానంటే అది తెలంగాణ కోసమే. మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. ప్రాంతీయవాదాన్ని విస్మరించని జాతీయవాదాన్ని పెంపొందించుకోవాలి. పర్యవరణాన్ని పరిరక్షించే బలమైన అభివృద్ధి జరగాలి. ఇవన్నీ.. ఒక్క రోజులో జరిగేవి కాదు. బావితరాలకు బలమైన సమాజాన్ని ఇచ్చేందుకే ఇలాంటి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నా." - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
ఏపీలో కులాల కొట్లాటతో..
"ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఒక కులాన్ని వర్గశత్రువుగా నిర్ధరించటం వల్ల అక్కడ అభివృద్ధి దిగజారిపోయింది. ఏపీలో రెండు కులాలు కొట్టుకోవటం వల్ల అభివృద్ధి కుటుబడిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. జనసేనకు దాష్టీకం, దౌర్జన్యం, పేదరికం, అవినీతి, మౌలిక వసతుల లేమి లాంటి ఎన్నో సమస్యలే వర్గశత్రువులు. అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్లే వర్గశత్రువులు. ఏపీలో ఉన్న వైసీపీ నాయకులు నాకు శత్రువులు కాదు. ఇక్కడ కూడా నాకు ప్రత్యర్థులు ఎవరు లేరు. నన్ను ఎంత మంది తిట్టినా.. వాళ్లేవరినీ శత్రువులుగా చూడను. వాళ్లందరినీ బలంగా ఎదుర్కుంటా. పార్టీ పెట్టి ఇన్ని ఏళ్లైంది. ఎందుకు రాలేదని చాలా మంది అడిగారు. తెలంగాణ ప్రజలు పిలిచేవారకు రాను. నాకు ప్రజల అనుమతి కావాలి. తెలంగాణ నేలపై నాకున్న మమకారం మీరు ఊహించలేరు." - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
ఆ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నా..
"రెండేళ్ల క్రితం నల్లమల్ల అడవుల నుంచి శివ అనే కుర్రాడు వచ్చాడు. నాది నల్లమల అన్న. అక్కడు యురేనియం తవ్వుతున్నారు. మా పెంటలన్నీ పోతున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్లకు ఫోన్ చేస్తే.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. నాకొచ్చిన ఇంగ్లీష్‌లో మాట్లాడితే.. వాళ్లకు అర్థం కావట్లేదు. నీకు చెప్తే.. పరిష్కారం దొరుకుతుందేమోనని వచ్చానన్నాడు. ఆ రోజు శివ మాట్లాడిన మాటలు నన్ను కదిలించాయి. ఒక పదిహేడేళ్ల కుర్రానికి పోరాడే స్ఫూర్తిని నేర్పించి ఈ తెలంగాణ నేల. ఆ స్ఫూర్తితోనే నేనూ ముందుకెళ్తున్నా." - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
ఇదీ చూడండి: