నియంత్రిత వ్యవసాయం పేరిట సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. మద్దతు ధర ప్రకటించగానే ఏ పంట వేయాలో నిర్దేశించడం సరికాదన్నారు. రైతులను కూలీలుగా మార్చే విధంగా నియంత్రిత వ్యవసాయం ఉందన్నారు. తన వ్యవసాయ భూమిలో ఏ పంట లాభసాటి కాగలదో రైతుకే పూర్తి అవగాహన ఉంటుందన్నారు.
కాలయాపన చేయడమేమిటి ?
యాసంగి పంట ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే నిలువ ఉందని... తూకం వేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికే లేదని చెప్పే తెరాస నేతలకు మంత్రుల పర్యటనకు ముందు ఎందుకు అరెస్టులకు పాల్పడ్డారని ప్రశ్నించారు.
ఆ గ్రామాల సమస్యలు పరిష్కరించాలి...
రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో ముంపు గ్రామాలను స్మరించుకున్నారని.. అలాగే వారి సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సభ నిర్వహించిన తర్వాతే ముంపు బాధితుల ఆడపిల్లలకు రూ. 2 లక్షలు ప్రకటించారని పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.