నిర్మల్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 1,500 కిలోమీటర్ల మేర 517 రహదారులున్నాయి. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 850 కిలోమీటర్ల రహదారులున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంచాయతీరాజ్ శాఖకు చెందిన 180 కిలోమీటర్లు మేర 61 రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్డు భవనాల శాఖకు చెందిన 25 రోడ్లు.. 230 కిలోమీటర్ల మేర మరమ్మతులకు గురయ్యాయి.
రాత్రి సమయాల్లో గుంతలు కనపడక..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ప్రయాణాలంటేనే భయపడుతున్నారు. రోడ్లు ఎక్కడికక్కడ గుంతలుగా మారాయని.. ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణం చేయాలంటేనే భయమేస్తోందని వాపోతున్నారు. అత్యవసర సమయాల్లో.. ఆస్పత్రులకు వెళ్లడం సైతం కష్టమవుతుందని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో గుంతలు కనపడక ద్విచక్రవాహనాలు బోల్తా పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్య సమస్యలు వస్తున్నాయ్..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు రహదారులు సైతం అస్తవ్యస్తంగా మారాయి. పట్టణంలోని దర్శనగర్, సిద్దాపూర్ ప్రధాన రహదారిని గత కొన్నేళ్లుగా తాత్కాలిక మరమ్మతులతోనే కాలం వెళ్లదీస్తున్నారని.. స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రహదారి పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతల రహదారుల్లో ప్రయాణించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించిన శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారు.
శాశ్వత పరిష్కారానికి రూ.75 కోట్లు..
వర్షాలు పడి రహదారులు దెబ్బతిన్న తర్వాత ఆయా శాఖల అధికారులు రోడ్ల పరిస్థితిపై సర్వే చేశారు. పంచాయతీరాజ్ రహదారులు, గ్రామాల్లోని కల్వర్టుల మరమ్మతులకు సుమారు రూ.13 కోట్లు వ్యయం అవుతుందని, ఆర్ అండ్ బీ రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ. 2.50 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. వీటి శాశ్వత పరిష్కారం కోసం రూ.75 కోట్లు ఖర్చవుతుందని ఆయా శాఖల అధికారులు పేర్కొన్నారు.