నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహింపేటలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఫలితంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పదిహేను రోజుల్లో 30 కుటుంబాలకు చెందిన 50 మందిపైగా జ్వరాల బారిన పడ్డట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. ఇబ్రహింపేటలో 100 నుంచి 150 మందికి టైపాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారు.
గ్రామంలోని వీధుల్లో పారిశుద్ధ్యం ఆధ్వానంగా ఉంది. మురుగు కాల్వల్లో రోజుల తరబడి నుంచి పూడికతీత పనులు జరగడం లేదు. దీంతో మురుగు నీరు నిలిచి దోమల వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలుగు నెలలుగా దోమల నివారణ మందు పిచికారి నిలిచిపోయిందన్నారు.
పురపాలికలో శివారు కావడంతో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. జ్వరాల కారణంగా ప్రైవేటు వైద్యశాలలు రోగులతో నిండిపోయాయి. ప్లేట్‌లెట్స్ తగ్గాయనే సాకుతో వేలకు వేల రూపాయల ఫీజులు వసూలు చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై పుర కమిషనర్ వేమన రెడ్డి వివరణ కోరగా.. విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నివారణ చర్యలు తీసుకుంటామన్నారు.