Amrabad tiger reserve: అమ్రాబాద్ పులుల అభయారణ్యం నుంచి చెంచుపెంటలు, గ్రామాల తరలింపు కసరత్తు ప్రక్రియ కీలకదశకు చేరింది. అక్కడి చెంచుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై రెవెన్యూ, అటవీ శాఖలు సర్వే చేపట్టాయి. తొలిదశలో కొల్లంపెంట, కుడిచింతలబైలు, ఫర్హాబాద్, తాళ్లపల్లి వాసులను తరలించాలని అటవీశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. అభయారణ్యం నుంచి బయటకు వెళ్లే వారికి రెండు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఒకటి పునరావాసం, పునర్నిర్మాణం... రెండోది రూ.15 లక్షల ప్యాకేజీ. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే రీలొకేషన్ కమిటీ సమావేశం త్వరలో ఉంటుందని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. కమిటీకి సభ్య కార్యదర్శిగా ఉండే జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) సంబంధిత శాఖలను సమావేశానికి పిలుస్తారని సమాచారం.
కర్ణాటక తరహా విధానం.. సామాజిక, ఆర్థిక సర్వేలు తొలిదశలో ఎంపికచేసిన పెంటలు, గ్రామాల్లో కుటుంబాలు, జనాభా, వారి ఇళ్లు, వ్యవసాయ భూములు, గొర్రెలు, పశువులను లెక్కిస్తున్నారు. అక్కడి నుంచి వీరిని ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎంతమంది తరలివెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు? వ్యతిరేకించేవారు ఎందరు? పునరావాసం ఎక్కడ, ఎలా కోరుకుంటున్నారు? వంటి అంశాలు ఇందులో తెలిసే అవకాశం ఉంది. ‘పరిహారంలో ఓ ఆప్షన్‌గా కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున నగదు పరిహారం ఇస్తారు. 18 ఏళ్లపైబడిన వారికి ఇది వర్తిస్తుంది.
మరొకటి పునరావాసం, పునర్నిర్మాణం. దీనికింద భూమికి భూమితో పాటు ఇళ్లు, ఇతర సామాజిక భవనాలతో ఓ కాలనీ కట్టిస్తారు. సర్వేలో భూమిలేని వారినీ గుర్తించాం. వారికి కర్ణాటక తరహా పరిహారం అందించే యోచన ఉంది’ అని అటవీ అధికారి ఒకరు చెప్పారు. నాగర్‌సోల్ టైగర్ రిజర్వు నుంచి ‘జెను కురుబ’ గిరిజనులను నాలుగేళ్ల క్రితం తరలించారు. ఆ టైగర్ రిజర్వులో పెద్దపులులతో పాటు ఏనుగుల సంచారం ఉంది. తేనె సేకరణే జీవనాధారంగా ఉండే వీరికి భూములు లేవు. అయినా రిజర్వు నుంచి బయటకు వెళ్లినవారికి కొంత భూమి ఇచ్చారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పెంటలు, గ్రామాల్లో భూములు లేని వారికీ కర్ణాటక విధానం వర్తింపజేస్తామని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రెండు చెంచు పెంటల్లో 30 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామని...మిగిలిన రెండు గ్రామాల్లో సంఖ్య బాగా ఎక్కువ ఉంటుందని త్వరలో కచ్చితమైన లెక్క తెలుస్తుందని అధికారులు అంటున్నారు.
ఎందుకంటే.. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పెద్ద పులుల సంఖ్య బాగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. పులులతో పాటు చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, రేసుకుక్కలు పెద్దసంఖ్యలో ఉన్నాయని.. ఈ వన్యప్రాణుల రక్షణకు, స్వేచ్ఛగా సంచరించేందుకు, అదే విధంగా స్థానికులకూ ఇబ్బంది కలగకుండా గ్రామాలను తరలిస్తామని అటవీశాఖ చెబుతోంది. అయితే తరలింపు ప్రక్రియపై వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది. దీంతో ఇబ్బంది తక్కువ ఉన్న పెంటలు, గ్రామాల్ని తొలుత తరలించడంపై అధికారులు దృష్టి పెట్టారు.