Rahul Gandhi Speech at Kollapur Meeting : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పాలమూరు ప్రజాభేరి సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారని.. అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు అందిస్తామని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకూ రూ.12 వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. దిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా తాను ఈ పర్యటనకు వచ్చానన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణతో తమది రాజకీయ అనుబంధం కాదని.. కుటుంబ అనుబంధమని పునరుద్ఘాటించారు.
Congress Palamuru Prajabheri in Nagarkurnool : ఈ క్రమంలోనే ప్రజల తెలంగాణ.. దొరల తెలంగాణకు మధ్య ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఒకవైపు సీఎం కుటుంబం ఉండగా.. మరోవైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు, మహిళలున్నారని తెలిపారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడాది కాకుండానే కూలే పరిస్థితి నెలకొందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న ఆయన.. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేశాయని ఆరోపించారు. రూ.లక్షల కోట్ల సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
Telangana Congress MLA Tickets Disputes : కాంగ్రెస్ టికెట్ల రగడ.. ఆ స్థానాల్లో మార్పు తప్పదా..?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం లేదు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్షల కోట్ల అవినీతి జరిగింది. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేశాయి. మేడిగడ్డ బ్యారేజీ ఏడాది కాకుండానే కూలే పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ చేసిన అప్పులతో ప్రతి కుటుంబంపై రూ.31 వేలకు పైగా భారం పడుతోంది. ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమించారు.. దొరల తెలంగాణ కోసం కాదు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేస్తుంది. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత
మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రతి కుటుంబంపై తీవ్ర భారం పడుతోందని రాహుల్ అన్నారు. ప్రతి కుటుంబంపై రూ.31 వేలకు పైగా భారం వేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమించారని.. దొరల తెలంగాణ కోసం కాదని ఆక్షేపించారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేస్తుందని తెలిపారు.
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2500, రూ.500కే గ్యాస్ సిలిండర్, అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రతి పేదకు రూ.5 లక్షలు, తెల్లరేషన్‌కార్డుదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్, ప్రతి పేదకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో రూ.10 లక్షల మేర వైద్య సౌకర్యం అందిస్తామని స్పష్టం చేశారు.