Palamuru Rangareddy Lift Irrigation Project Specialties : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పంప్‌హౌస్‌లు, బహిరంగ కాలువలు, సొరంగ మార్గాలు విద్యుత్ సబ్‌స్టేషన్లు, కంట్రోల్ యూనిట్లు ఉన్నాయి. అప్రోచ్ ఛానల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ నుంచి వచ్చిన కృష్టా జలాలను 9 మీటర్ల వ్యాసంతో ఉన్న సొరంగ మార్గాల ద్వారా నార్లాపూర్ సర్జిపూల్(Narlapur Pump House)కు పంపిస్తారు. చెరువును తలపించే నార్లాపూర్ సర్జిపూల్ పొడవు 255 మీటర్లు.. వెడల్పు 21 మీటర్లు.. లోతు 74 మీటర్లుగా ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. సర్జిపూల్‌లో దాదాపు 24 వేల క్యూసెక్కుల నీరు నిల్వ చేసే అవకాశం ఉంది. నిల్వ చేసిన నీటిని పంపుల ద్వారా పైకి ఎత్తిపోస్తారు.
Palamuru Rangareddy Project Full Details : ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద భారీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 67.74 టీఎంసీలు. కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద తలపెట్టిన జలాశయం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇందుకోసం నిర్మించిన 5 పంప్‌హౌసుల్లో మొత్తం 35 భారీ పంపులు ఏర్పాటు చేస్తున్నారు. సివిల్ పనులన్నీ దాదాపుగా పూర్తి కాగా.. ఇక్కడ వినియోగించే పంపుల గరిష్ఠ సామర్థ్యం 145 మెగావాట్లు. ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మిస్తున్న సొరంగాల మార్గం పొడవు 61.57 కిలోమీటర్లు కాగా.. కాలువల పొడవు 915.47 కిలోమీటర్లు. భూగర్భంలోనే భారీ పంప్ హౌస్‌లతో పాటు ఆసియాలోనే అతి పెద్దవైన సర్జ్‌పూల్‌లు నిర్మించారు.
Palamuru Rangareddy Project Inaugurations : పర్యావరణ అనుమతులు లభించని కారణంగా మొదటి దశలో తాగు నీటి కోసమే పనులు చేపట్టారు. సివిల్ పనులు పూర్తి చేసి కొన్ని పంపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధం చేశారు. రెండో పర్యావరణ అనుమతులను కూడా ఈఏసీ ఇటీవలే సిఫారసు చేసింది. దీంతో రెండో దశలో సాగునీటి పనులను కూడా వేగవంతం చేయనున్నారు. మిగిలిన పంపుల ఏర్పాటుతో పాటు కాల్వల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎత్తిపోతల పథకంలో రెండో, అతి పెద్దది ఏదుల పంప్‌హౌస్. 10 పంపుల సామర్థ్యంతో ఏదుల పంప్‌హౌస్‌ను నిర్మించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 145 మెగావాట్ల సామర్థ్యం గల అతిపెద్ద పంపులు ఏర్పాటు చేశారు. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన వాటి కంటే పెద్దవని ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో.. భవిష్యత్ తరాలకు అనుగుణంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినట్లు ఆయన చెబుతున్నారు.