మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిమ్మసానిపల్లికి చెందిన ప్రియాంక నిండు గర్భిణీ. భర్త జైలుకు వెళ్లడంతో కూలీ పనులు చేసుకొంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతుండటంతో ఓ స్వచ్చంద సంస్థకు చెందిన వ్యక్తి ఆమె పరిస్థితిని కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా వివరించారు. పక్కింటి వారి సహాయంతో ప్రసవం కోసం జనరల్ ఆసుపత్రికి తరలించారు. స్పందించిన మంత్రి కేటీఆర్ విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలపడగా అధికారులను అప్రమత్తం చేశారు.
ప్రసవ వేదనతో బాధపడుతున్న ప్రియాంకకు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ చికిత్స అందించారు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉండటం వల్ల డిశ్చార్జి చేశారు. ప్రసూతి వార్డుకు వెళ్లి ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారి రాజేశ్వరి... అప్పటికే ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడని.. ఇప్పుడు ఆడపిల్లకు జన్మనివ్వగా ఆలన పాలనకు ఇబ్బందులు ఎదురుకాకుండా వారి బాధ్యతలను ఐసీడీఎస్ చూసుకుంటుందన్నారు.
ఆకలితో అలమటిస్తూ ఓ గర్భిణీ పడుతున్న ఆవేదనను యువకుడు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించగా సకాలంలో వారికి మెరుగైన చికిత్స అందింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉండటంతో పలువురు ప్రశంసిస్తున్నారు.