ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కొనసాగుతోన్న డ్రై రన్ - Telangana news
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కొవిడ్ వాక్సినేషన్ డ్రై రన్ కొనసాగుతోంది. మొత్తం 95 కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రానికి 25 మంది చొప్పున 2,375 మంది డ్రై రన్లో పాల్గొన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్ డ్రై రన్ కొనసాగుతోంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో జిల్లా ఆసుపత్రులు సహా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలుపుకుని మొత్తం 95 కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రానికి 25 మంది చొప్పున 2,375 మంది డ్రైరన్‌లో పాల్గొన్నారు.
ఉదయం 9 గంటలకే డ్రై రన్ ప్రారంభించారు. టీకా పంపిణీ కోసం ప్రతి కేంద్రంలో వెరిఫికేషన్, వాక్సినేషన్, అబ్జర్వేషన్ గదులను ఏర్పాటు చేశారు. టీకా వేసిన తర్వాత బయో మెడికల్ వ్యర్థాలను వేసేందుకు మూడు రంగుల్లో బుట్టలు ఏర్పాటు చేశారు. టీకా వికటిస్తే ఎదుర్కొంటునేందుకు అవసరమైన మందులు, వైద్యుల్ని సైతం అందుబాటులో ఉంచారు.
టీకా వేయడం మినహా మిగిలిన దశ అమలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ ఎలా ఉందో డ్రై రన్లో గమనించనున్నారు. డ్రైరన్ ముగిసిన తర్వాత మండల స్థాయి కమిటి సమావేశాల్లో క్షేత్రస్థాయి సమస్యలను చర్చించనున్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తారు. కో-విన్ వెబ్యాప్లో సాంకేతిక సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు.